ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంటి గోబెల్స్ వారసులు చెప్పే అబద్ధాలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇటీవల సీఎం హోదాలో పాలమూరులో రేవంత్ చెప్పిన పచ్చి అబద్ధాలు కంపరమెత్తించాయి, కలవరపెట్టాయి. పాలమూరును మరింత చీకట్లోకి నెట్టాయి. చేసిన వాగ్దానాలు, ఇచ్చిన గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేని దుర్మార్గం.
రైతుబంధు, రైతుబీమా ఇవ్వలేక, ఆరుగాలం రైతు శ్రమించి పండించిన పంటను కొనలేక, కొన్న ధాన్యానికి బిల్లులు ఇవ్వలేక నానా అవస్థలు పడుతున్నారు. రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వలేక, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు కొనసాగించలేక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిపై చిల్లర మాటలు మాట్లాడారు. ప్రజలను పక్కదారి పట్టించటానికి తొమ్మిదిన్నరేండ్ల బంగారు తెలంగాణపై తప్పుడు ఆరోపణలు చేశారు. వాస్తవానికి పాలమూరు జిల్లా ఆకలి జిల్లాగా మార్చిందే ఆనాటి కాంగ్రెస్, టీడీపీ పాలకులు. దత్తత పేరిట వలసలకు శాశ్వత జిల్లాగా మార్చిన ప్రబుద్ధులే ఆనాటి వంచక పాలకులు. కరుణ లేని కాంగ్రెస్ నాయకుల వల్లనే పాలమూరు జిల్లా వాసులు శ్రమజీవులు, వలస జీవులుగా మారారు.
‘కాంగ్రెస్‌తోపాటు మీ గురువు బాబు పాలించిన మొత్తం కాలమంతా అరిగోసపడ్డాం. అప్పులపాలై పరాయి దేశం బండెక్కాం. తలాపున నదులున్నా చుక్క నీరులేక విలవిల్లాడిపోయాం. నీళ్లు, భూములు దండిగా ఉన్నా మా బతుకులు ఇలా కాలిపోవటానికి నయవంచక కాంగ్రెస్ పాలన, మీ గురువు చలువేనని మరచి, పాలమూరు సభలో శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టింది తామేనంటూ చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్ట్ వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఒరిగిందేమీ లేదన్న సంగతి తెలియకపోవటం మీ అజ్ఞానానికి నిదర్శనం’. పాలమూరు ఎద మీద కృష్ణమ్మ దాదాపు మూడు వందల కిలోమీటర్లు ప్రవహిస్తున్నది. 74 శాతం కృష్ణా పరీవాహకమంతా ఈ జిల్లాలో ఉన్నది. న్యాయంగా కృష్ణా నీటిపై సర్వహక్కులు మహబూబ్‌నగర్‌కే ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీ పరిపాలన నిర్వాకం వల్ల పాలమూరుకు దక్కాల్సిన నీటినంతా దోచుకుపోయారు. కృష్ణా బేసిన్లో ఉన్న పాలమూరును పడావు బెట్టి, ఎడారిగా మార్చి, పెన్నా బేసిన్లో ఉన్న రాయలసీమ ప్రాంతానికి అన్యాయంగా తరలించిన నీటి లెక్కలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తాయి.
‘సీమలో పెద్ద పెద్ద సాగునీటి బరాజ్‌లు నిర్మించారు. మాకు దక్కాల్సిన మా పాలమూరు నీటిని డబ్బు, పరపతి సంపాదించి పెట్టిన మద్రాస్ నగరానికి తరలించారు. బలవంతంగా నీటిని దోపిడీ చేశారు. శ్రీశైలం డెడ్‌స్టోరేజీలో ఉన్న నీటిని కూడా కొల్లగొట్టే విధంగా పోతిరెడ్డిపాడు షట్టర్లు నిర్మించారు. తామే నిర్మించామని గొప్పగా చెప్తున్న శ్రీశైలం ప్రాజెక్ట్ వల్ల పాలమూరు జిల్లాకు జరిగిన మేలేమిటో చెప్పండి. మీవల్ల మా జిల్లా విధ్వంసానికి గురైంది’. భాషాప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు వల్ల పాలమూరుకు జరిగినంత అన్యాయం ఏ జిల్లాకూ జరుగలేదు. నిజాంకాలం నాటి సాగునీటి ఒప్పందాలను మీ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా వదిలేసింది. తుంగభద్ర డ్యామ్ నుంచి తొంభై టీఎంసీల నీరు ఇవ్వాలని నిజాం కాలంలో ఒప్పందం జరిగింది. కాలువ కూడా తీశారు. తర్వాత హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్రాలో విలీనం చేయటంతో తుంగభద్ర డ్యామ్ కర్నాటకకు పోయింది. కాంగ్రెస్ సరైన వాదనలు చేయకపోవటంతో ఆ కాలువ మట్టిలో పూడుకుపోయింది.
హైదరాబాద్, మద్రాస్ రాష్ర్టాల మధ్య తుంగభద్ర నది ఉన్నందువల్ల ఈ నదిలో ఇరు ప్రాంతాలకు సమాన హక్కులు ఉన్నాయని నిజాం హయాంలో ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు కావటం వల్ల ఆ ఒప్పందం హుష్‌కాకి అయింది. నీటినంతా కేసీ కెనాల్ ద్వారా రాయలసీమకు తరలించారు. ఆర్డీఎస్ కాలువ ద్వారా రావాల్సిన 15.9 టీఎంసీల నీళ్లు రాకుండా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డైనమైట్లతో పేల్చేశాడు.
ఇప్పుడు ఆర్డీఎస్కు ఆరు టీఎంసీల నీరు కూడా రావటం లేదు. చివరి ఆయకట్టుకు నీళ్లు అందించటానికి ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్ల లిఫ్ట్‌ను బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నిర్మించారు. తుంగభద్ర నీటి విషయంలో కాంగ్రెస్, టీడీపీ పోటీ పడి చాలా అన్యాయం చేశాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి దగ్గర నిర్మించిన సుంకేసుల ప్రాజెక్ట్‌కు తుంగభద్ర నదినంతా మలుపుకున్నారు. ఎడమ కాలువ లేని ప్రాజెక్ట్ బహుశా దేశంలో ఏదైనా ఉన్నదంటే ఇది తప్పా ఇంకొకటి ఉండకపోవచ్చు. పర్యావరణం కోసం కనీసం ఒక షట్టర్ ద్వారా తెలంగాణ ప్రాంతానికి నీరివ్వాలని ఆనాటి జీవోలో పొందుపర్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ షట్టర్‌ను కూడా, మళ్లీ తీయటానికి వీల్లేకుండా వెల్డింగ్‌తో శాశ్వతంగా మూసివేసింది. నారాయణపూర్ డ్యామ్ ద్వారా పాలమూరుకు రావాల్సిన నీళ్లు కాంగ్రెస్ వైఖరి వల్ల ఆగిపోయాయి. భీమా ప్రాజెక్ట్, కోయిల్‌సాగర్ కాంగ్రెస్, టీడీపీ వల్లే ఆగమయ్యాయనేది పాలమూరు జిల్లాలో కూలిన మట్టిగోడలే సాక్ష్యం. కొన్నేండ్లపాటు పచ్చగా ఉన్న ఊళ్లను కాంగ్రెస్ పాలకులు వల్లకాడు చేస్తున్నారు. నాటి వలస పాలన పరిస్థితులు మళ్లీ దాపురించాయి.
‘మా బాపు కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే మా చీకటి బతుకుల్లోకి వెలుతురు వచ్చింది. మీవల్ల విధ్వంసమైన పాలమూరు పచ్చబడింది. మీరు అప్పనంగా అప్పగించిన నీళ్లుపోను..మిగిలిన నీటి వనరులను వినియోగంలోకి తెచ్చారు. ఒక్కో నీటిబొట్టును ఒడిసిపట్టి మా పొలాలకు మళ్లించారు. సంప్రదాయబద్ధ్దమైన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించారు’. ఉద్యమకాలంలోనే పాలమూరు నీటిగోసపై టీఆర్ఎస్ ఉద్యమం నడిపింది. పార్టీ అధినేత కేసీఆర్ పాదయాత్ర చేసి, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం ద్వారా నీటి లభ్యతపై అధ్యయనం చేయించారు. వారి సూచన మేరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసి, అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో తొంభైశాతం పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో తెలంగాణ నీటి హక్కులను హరించటానికి గురుశిష్యులు ఇద్దరూ పన్నాగం పన్నుతున్నారు. కేవలం పది శాతం మాత్రమే మిగిలి ఉన్న ప్రాజెక్టులను సందర్శించి మొత్తం తామే చేసినట్టు ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్‌ను ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించటం ఖాయం.