నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 10 : కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో అమలు చేస్తున్న ఆత్మ నిర్మాణ్ భారత్-పట్టణ ప్రగతి రుణాల్లో దేశంలోనే నిర్మల్ మున్సిపాలిటీకి మొదటి స్థానం దక్కింది. 2020లో మొదటి దశలో కరోనా వ్యాప్తితో లాక్డౌన్ విధించడంతో వీధి వ్యాపారాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అన్ని మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు రుణాలు అందించారు. మొదటి విడుతలో నిర్మల్ మున్సిపాలిటీలో 4655 మంది చిరు వ్యాపారులకు రూ. 4 కోట్ల 65 లక్షల 50 వేలు అందించగా, రెండో విడుతలో ఇప్పటి వరకు 964 మంది దరఖాస్తు చేసుకుంటే.. 563 మందికి రూ.20 వేల చొప్పున రుణాలు చెల్లించారు. లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో అత్యధిక మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించినందుకుగాను నిర్మల్ మున్సిపాలిటీకి దేశంలోనే మొదటి స్థానం దక్కినట్లు మెప్మా పీడీ సుభాష్ తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారం, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రోత్సాహంతో కేవలం రెండు నెలల్లోనే నిర్మల్ మున్సిపాలిటీకి ఈ స్థానం దక్కడంపై హర్షం వ్యక్తమవుతున్నది. వీధి వ్యాపారులకు దేశవ్యాప్తంగా ఆత్మనిర్మాణ్ భారత్ కింద రుణాలను అందిస్తుండగా.. రాష్ట్రంలో పట్టణ ప్రగతి ద్వారా ఈ రుణాలను అందిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారం, కలెక్టర్ ప్రోత్సాహం, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వీధి వ్యాపారులకు రుణాలను అందించారు. ప్రతిరోజూ పట్టణంలోని పలు వీధుల్లో కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు, హోటళ్లు, బట్టలు, చిరు వ్యాపారుల దుకాణాలు నిర్వహిస్తున్న వారికి రెండో విడుత కింద రూ. 20 వేల చొప్పున రుణాలు అందిస్తున్నారు. మొదటి విడుత కింద అందించిన రుణాలను సక్రమంగా చెల్లించి వ్యాపారం వృద్ధి చేసుకున్న వారిని గుర్తించి రెండో విడుత రూ.20 వేల చొప్పున అందిస్తున్నారు. ఈ రుణాలు ఉపయోగపడుతుండడంతో చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద చిన్న టీ కొట్టు నడుపుకుంటున్న. ప్రభుత్వ కార్యాలయ సార్లకు రోజూ చాయ్ పోస్త. వీధి వ్యాపారుల కింద మొదట రూ.10 వేల రుణం ఇచ్చారు. ఆ రుణంతో చాయ్‌తో పాటు అల్పాహారం కూడా తయారు చేసి విక్రయిస్తున్న. గిరాకీ పెరిగింది. అవ్వి కట్టడంతో ఇప్పుడు రూ.20 వేలు ఇస్తున్నారు. ఈ డబ్బులను కూడా సక్రమంగా వినియోగించుకుంటా. – లక్ష్మణ్, ఛాయ్ వ్యాపారి
లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు రుణాలను అందించడంలో నిర్మల్‌కు దేశంలోనే మొదటిర్యాంకు ఇందుకు సంతోషంగా ఉంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రత్యేక చొవరతో రెండో విడుత 964 మంది దరఖాస్తు చేసుకుంటే.. 563 మందికి రుణాలను అందించాం. నిర్మల్ మున్సిపాలిటీకి మొదటిస్థానం,గజ్వెల్‌కు రెండో స్థానం దక్కింది. – సుభాష్, మెప్మా పీడీ