లక్ష్మణచాంద: రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాచాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం వరి ఏ గ్రేడు రకానికి రూ. 1960 , బీ గ్రేడు రకానికి రూ.1940ల మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో వరి దిగుబడి ఎక్కువగా పెరుగడంతో పాటు దొడ్డురకం ధాన్యాన్ని ఉపయోగించడం తగ్గిందన్నారు.
ప్రస్తుతం దొడ్డురకం ధాన్యానికి డిమాండ్ పడిపోవడం, గోదాంలలో నిలువలు పెరిగిపోవడంతో దొడ్డురకం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో ఈ సంవత్సరం వర్షాకాలం వరిపంటను కొనుగోలు చేయడానికి ఒప్పుకుందన్నారు. వరికి బదులుగా ఆయిల్‌ఫాం సాగుచేయాలని సూచించారు. ఆయిల్‌ఫాం సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలు వేసుకోవడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు.
ఖమ్మం, వరంగల్ జిల్లాలలో సాగుచేస్తున్న ఆయిల్‌ఫాం క్షేత్రాలను రైతులు పరిశీలించడానికి తాను అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రఘునందన్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, సర్పంచ్ సాతం బొర్వవ్వ, ఎంపీటీసీ బూసి రమా, ఎంపీడీవో చంద్రశేఖర్, తాసీల్దార్ కవితారెడ్డి, నాయకులు వికాస్ రెడ్డి, అడ్వాల రమేశ్, సాతం గంగారాం తదితరులు పాల్గొన్నారు.