దస్తూరాబాద్, జనవరి 30 : గాంధీ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెర్కపల్లిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తుంగూరి వెంకట్రాజం మాట్లాడుతూ.. 200 సంవత్సరాలు భారత దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుంచి విముక్తి చేసేందుకు పోరాడిన నాయకుల్లో గాంధీజీ ప్రముఖులు. చేత కర్రబట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని చాటి చెప్పిన మహనీయుడు మన మహాత్మాగాంధీ అన్నారు. గాంధీజీ శాంతి, సత్యం అనే ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. బ్రిటిష్ పాలకుల్ల చేతుల్లోంచి.. భారతమాతకు విముక్తి కలిగించిన గొప్ప వ్యక్తి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాధిక, విద్యార్థులు పాల్గొన్నారు.