కడెం, ఏప్రిల్ 2: కడెం ప్రాజెక్టు కింద పంటలకు నీరు రాక ఎండిపోతున్నాయని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామానికి చెందిన దాదాపు 60 మంది రైతులు బుధవారం కడెం మండల కేంద్రంలోని నీటిపారుదలశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కడెం ప్రధాన కాలువ ద్వారా తమ పంటలకు నీటిని విడుదల చేయాలని, నీరు రాక పంటలు ఎండుతున్నాయని అన్నారు.
చేతికొచ్చిన పంటలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తమ గోడును పట్టించుకోవాలని వేడుకున్నారు. పంట చివరి సమయంలో నీరు విడుదల చేయకపోతే పంటలు నష్టపోతే తమకు చావే శరణ్యమని అధికారులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన 60 మంది రైతులు పాల్గొన్నారు.