Dilawarpur:ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి జాదవ్ పరుశురాం (Jadhav Parashuram) అన్నారు. మంగళవారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన పరిశీలించారు. తరగతి గదిలోనికి వెళ్లి విద్యార్థులతో కాసేపు మాట్లాడిన ఆయన అనంతరం కళాశాలలోని అధ్యాపక బృందంతో సమావేశం నిర్వహించారు.
విద్యార్థుల అడ్మిషన్లను పెంచాలని, అందుకోసం అధ్యాపకులు సమిష్టిగా పనిచేయాలని జాదవ్ సూచించారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపిన ఆయన.. ప్రతి విద్యార్థిని జాతీయ పరీక్షలకు పోటీపడే విధంగా బోధన చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అంతేకాదు అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థి పబ్లిక్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనని జాదవ్ పేర్కొన్నారు.
విద్యార్థులు రోజూ కాలేజీకి వచ్చేలా వారిని చైతన్య పరచాలని ఉపాధ్యాయులను కోరారు జాదవ్. ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనాలకు ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రభుత్వం ఉచితంగానే పాఠ్యపుస్తకాలను అందిస్తున్నందున.. విద్యార్థులపై ఆర్ధిక భారం పడదని తెలిపారు. అంతేకాదు అందరూ శ్రద్ధగా పాఠాలు విని.. మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఈ. సుదర్శన్, అధ్యాపకులు కృష్ణ జైపాల్, ఆనంద్, పలువరు విద్యార్థులు పాల్గొన్నారు.