కట్టంగూర్, జులై 01 : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారి డివైడర్‌ను ఢీ కొట్టడంతో 10 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ప్రమాదం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ శివారులోని 65వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకొంది. ప్రయాణీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కేవీఆర్ ట్రావెల్ ప్రైవేట్ బస్సు సోమవారం అర్ధరాత్రి 30 ప్రయాణీకులతో విజయవాడ నుండి హైదరాబాద్‌కు బయల్దేరింది.
మార్గమద్యంలో అయిటిపాముల గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో బస్సు కల్వర్టు డివైడర్‌ను ఢీకొట్టింది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ప్రయాణీకులు మేలుకుని బస్సులో నుండి దిగేందుకు ప్రయత్నించగా డోర్ లాక్ కావడంతో బయటకు రాలేకపోయారు. సమాచారం తెలుసుకున్న కట్టంగూర్ 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని అత్యవసర డోర్‌ను ధ్వంసం చేసి ప్రయాణీకులను బస్సులోంచి కిందికి దింపారు. గాయపడ్డ వారిని 108 వాహనాల్లో నార్కట్‌పల్లి కామినేని దవాఖానకు తరలించారు.