జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనుల నిర్వహణకు కేంద్రం తెచ్చిన కొత్త సాఫ్ట్వేర్ కూలీల ఉపాధిపై దెబ్బ కొట్టనుంది. స్థానిక ప్రాధాన్యతా పనులకు అడ్డుపుల్ల కానుండగా, కూలీల ఆదాయానికీ గండి పడనున్నది. కాగా, కొత్త సాఫ్ట్‌వేర్‌ను నేటి నుంచి అమలు చేయాలని ఆదేశాలివ్వడంతో పాటు సిబ్బందికి శిక్షణను కూడా ఇప్పటికే పూర్తి చేసింది. పనులపై రాష్ట్రప్రభుత్వం పర్యవేక్షణను అడ్డుకోవడంలో భాగంగా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. –
నిర్మల్ టౌన్, జనవరి 30 : 2005 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జాబ్‌కార్డు పొందిన ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించేందుకు రాష్ర్టాలకు అధికారం కల్పించారు. కాగా, రేపటి నుంచి అమల్లోకి రానున్న సాఫ్ట్‌వేర్‌తో కేంద్ర అనుమతి ఉంటేనే పనులు నిర్వహించే వీలుంటుంది. దీని ద్వారా రాష్ర్టాల బాధ్యత తగ్గించే చర్యలకు దిగుతున్నది. ఇకపై ఆయా గ్రామాల్లో ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసిన పనులకు చెక్ పడనుంది. ఉపాధిహామీ కూలీలకు కూడా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఏటా ప్రతి జిల్లాలో జాబ్‌కార్డు పొందిన కూలీలకు పని కల్పిస్తారు. గతంలో ప్రభుత్వం ఆయా రాష్ర్టాలకు ఉపాధిహామీ పథకం కింద బడ్జెట్‌ను కేటాయించేది.. జిల్లాల వారీగా నిధులు కేటాయించి స్థానికంగా ఏ పనులు అవసరమో వాటిని గుర్తించి కూలీలకు పని కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది. ఇందుకోసం రాగాస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేగాస్ సాఫ్ట్‌వేర్‌ను నేటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చి కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. నేటి నుంచి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఆయా జిల్లాల్లో ఏ పని చేపట్టాలన్నా ఆ పనికి సంబంధించిన గ్రామ, మండల, జిల్లా పరిషత్‌ల తీర్మానంతో పాటు పని విలువ, మెటీరియల్, లేబర్, తదితర వివరాలను ఈ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసిన తర్వాతే కేంద్రం సంతృప్తి చెందితే పనులకు అనుమతి ఇవ్వనున్నారు. ఇదివరకు రాష్ట్ర సాఫ్ట్వేర్ అమలుతో స్థానిక కూలీల డిమాండ్‌ను బట్టి ఆ పనులు నిర్వహించేది. అందుకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే బిల్లులు తీసుకునే అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఈ విధానంపై పెత్తనం చెలాయించడంతో పాటు ఉపాధిహామీ కూలి పనుల్లో కోత విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో 6లక్షల మందికి ఉపాధి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరం పనుల ప్రణాళికలను రూపొందిస్తారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని మొత్తం 66 మండలాల పరిధిలో 1507 గ్రామ పంచాయతీలు ఉండగా, 5,77,047 జాబ్‌కార్డులు ఉన్నాయి. 3,32,240 కుటుంబాలు జాబ్‌కార్డులు పొందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీటిలో 5,97,403 మందికి కూలీ పనులు కల్పిస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకు జాబ్‌కార్డును బట్టి ఉపాధికూలీల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఉపాధి బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ. 420 కోట్లకు పైగా ప్రతి సంవత్సరం ఉపాధి హామీ పనులు నిర్వహిస్తునట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో నిర్మల్‌లో అత్యధికంగా రూ. 125కోట్లు, ఆదిలాబాద్‌లో రూ.120కోట్లు, ఆసిఫాబాద్‌లో రూ.100కోట్లు, మంచిర్యాలలో రూ.80కోట్ల ఉపాధి పనులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. హరితహారంలో మొక్కలు నాటడం, చెరువులో మట్టితీత, ఇంకుడుగుంతల నిర్మాణం, ఫామ్ఫండ్ నిర్మాణం, చేపల చెరువులు, తదితర 36 రకాల పనులకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కూలీలను వినియోగిస్తున్నారు. ఈ పనుల్లో జాబ్‌కార్డు పొందిన ప్రతి ఒక్కరికీ వందరోజుల పనిని కచ్చితంగా కల్పించాలని ఉపాధిహామీ చట్టంలో పేర్కొంది. రాష్ట్రం ఆయా ప్రాంతాల్లో కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వంద రోజులు పని దాటిన వారికి కూడా పని కల్పించే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ వల్ల కూలీల వంద రోజులు దాటితే పని దొరికే అవకాశం లేదు. ప్రతి సంవత్సరం ఉపాధిహామీ నిధులతో రాష్ట్ర సర్కారు ఆయా జిల్లాలో స్థానిక అవసరాలను గుర్తించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులను చేపట్టి ఉపాధి కూలీలకు పని కల్పిస్తోంది. ఇప్పుడు సరైన పనిగా కేంద్రం గుర్తిస్తేనే అనుమతి లభించనుంది. మరోవైపు వేసవిభత్యానికీ చెక్ పడనుంది. దీనికితోడు పని జరిగే ప్రదేశాల్లో పనుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత, తాత్కాలిక, దివ్యాంగుల గ్రూపులను ఏర్పాటు చేసి ఒక్కొక్క గ్రూపులో కనీసం 10-25 మందికి అవకాశం కల్పిస్తారు. ఇప్పుడు శాశ్వత గ్రూపులో కాకుండా తాత్కాలిక గ్రూపులో సభ్యులు ఒక గ్రూపు నుంచి మరో గ్రూపునకు మారే అవకాశం కల్పించనున్నారు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పని ప్రదేశం, ఊరు పేరు, గ్రూపు పేరు, ఆ రోజు హాజరైన కూలీల సంఖ్య, మాస్టర్ గ్రూపులో నమోదు, పని విలువలతో కూడినవి రికార్డులో నమోదు చేసి పని ప్రదేశం నుంచే ఆన్లైన్లో నమోదు చేస్తేనే ఉపాధి కూలీలకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతంలో క్షేత్రస్థాయి సిబ్బంది పని కొలతల ఆధారంగా లేబర్, పని విలువ మండలంలో ఆన్లైన్లో నమోదు చేసేవారు. పని నిర్వహణలో ఉ పాధి మేటీలకు ఉపాధి కూలీలకంటే రూ.3 అదనంగా చెల్లించేవారు. ఇప్పుడు ఆ విధానానికి కొత్త సాఫ్ట్వేర్ స్వస్తిపలకడంతో ఉపాధి మేటీలకు వచ్చే వేతనంలోనూ కోత పడనుం ది. ఇప్పటికే కొత్త సాఫ్ట్వేర్ అమలుపై ఆయా జిల్లాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల పర్యవేక్షణలో సాంకేతిక సి బ్బందికి మూడు రోజుల పాటు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి పూర్తి సన్నద్ధం చేశారు. ఏదిఏమైనా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులపై రాష్ట్ర అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ విధానం అమలు చేయడంపై ఉపాధిహామీ కూలీల్లో కూడా కొంత నిరుత్సాహం నెలకొన్నది.