జైనూర్ ఫిబ్రవరి 09 : అంగన్వాడీ కార్యకర్తలు సమయపాలన పాటించాలని ఐసిడిఎస్ జైనూర్ ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓ ఇందిర అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఉదయం తొమ్మిది గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలలో తప్పనిసరి ఉండాలన్నారు. ప్రాజెక్టు అభివృద్ధి కోసం అందరు సహకరించాలని, సమయపాలన పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంగన్వాడీ కేంద్రాలలో ప్రతినెల గ్రామపంచాయతీ కార్యదర్శులు, తాసిల్దార్ సంబంధిత అధికారులు వచ్చినప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు వారికి సహకరించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగమ్మ, సోంబాయి, హజీరా, సృజన, శ్యామ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.