నిర్మల్: భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు (Gaddenna Vagu Project) భారీగా వరద వస్తున్నది. దీంతో మూడు గేట్లు ఎత్తి 20,500 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు. ప్రస్తుతం 358.55 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఆకాశానికి చిల్లు పండిందా అన్నట్లు కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 13 సెంటీమీటర్లు కాగా, నిర్మల్ పట్టణంతోపాటు నిర్మల్ మండలంలో అత్యధికంగా 33 సెంటీమీటర్ల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. అలాగే జిల్లాలోని అన్ని మండలాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడింది. గురువారం తెల్లవారుజాము నుంచి కూడా నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు మూడు గంటలపాటు ఏకదాటిగా మళ్లీ వర్షం కురిసింది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే పాత జాతీయ రహదారి నిర్మల్ శివారులో పూర్తిగా కొట్టుకుపోవడంతో మార్గాన్ని మూసివేశారు. బాసర మండలంలోని బిద్రెల్లి గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో భైంసా నుంచి నిజామాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. సారంగాపూర్ మండలంలోని జాం గ్రామం వద్ద నిర్మల్-సారంగాపూర్ ప్రధాన రహదారిపై నుంచి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. సోన్ మండలంలోని మాదాపూర్ వద్ద స్వర్ణ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మాదాపూర్, పాక్పట్ల, గాంధీనగర్, వెల్మల్ గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నిర్మల్ శివారులోని సిద్ధాపూర్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో నిర్మల్ నుంచి కౌట్ల(కే), ముజ్గి, తాంశ, సిద్దులకుంట గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కుంటాల మండలంలోని కల్లూర్ నుంచి అందకూర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఇదే మండలంలో కుంటాల నుంచి అంబకంటి వెళ్లే రోడ్డు కోతకు గురైంది. సారంగాపూర్ మండలంలోని జాం గ్రామ సమీపంలో హైలెవెల్ కాలువకు గండి పడడంతో కాలువ సమీపంలోని పొలాలన్నీ నీట మునిగాయి. లక్ష్మణచాంద మండలంలోని మునిపెల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి శంకర్‌నాయక్ బుధవారం నుంచి గోదావరి మధ్యలో గల ఓ పాయలో(కుర్రు) చిక్కుకుపోయాడు. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో దాదాపు 24 గంటల రెస్క్యూ తర్వాత ఎట్టకేలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం గురువారం మధ్యాహ్నం పశువుల కాపరి శంకర్‌ను పడవలో బయటకు తీసుకొచ్చారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
నిర్మల్ పట్టణంలోని చాలా కాలనీలు నీట మునగడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. జీఎన్ఆర్ కాలనీలోకి వరద రానున్నదని అధికారులు ముందే హెచ్చరించడంతో కాలనీవాసులు తమ ఇండ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. జీఎన్ఆర్ కాలనీతోపాటు, విశ్వనాథ్‌పేట్, సోఫీనగర్, ఇంద్రానగర్, ప్రియదర్శిని నగర్, నటరాజ్‌నగర్ కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. కుంటాల మండల కేంద్రంతోపాటు ఓలా, అందకూర్ గ్రామాల్లో ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు జిల్లాను ఆరేంజ్ జోన్‌గా అలర్ట్ చేయడంతో కలెక్టర్ అభిలాష అభినవ్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
మరో రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇండ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఆస్తినష్టంతోపాటు పంటలకు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. నిర్మల్ మండలం ముజ్గి, తాంశ, చిట్యాల్ మంజులాపూర్ శివారులో దాదాపు 100 ఎకరాల వరకు వరిపంట నీట మునిగినట్లు రైతులు చెబుతున్నారు. అలాగే సోన్ మండలం కడ్తాల్‌లో స్వర్ణ వాగు ఉప్పొంగడంతో పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుకున్నది. వరదల్లో చిక్కుకుంటే అత్యవసర సమయంలో 9100577132 నంబరుకు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.