National Science Day | నిర్మల్ అర్బన్, పిబ్రవరి 27 : విద్యార్థులను చదువుతో పాటు ప్రయోగాలవైపు మళ్లించి, భవిష్యత్‌లో భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు ఈ మాస్టారు. పిల్లలకు సైన్స్ పాఠాలు బోధిస్తూ, ఉపాధ్యాయులకు సైతం శిక్షణ ఇస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు సారంగాపూర్ మండలం చించోలి(బీ) జడ్పీఎస్ఎస్ పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచర్ కూన రమేశ్. అనేక అవార్డులు అందుకొని నిర్మల్ జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలిపిన ఈ ఉపాధ్యాయుడిపై జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
కుభీర్ మండలం చాత గ్రామానికి చెందిన ఫిజికల్ సైన్స్ టీచర్ రమేశ్ నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్లో నివాసం ఉంటున్నారు. సారంగాపూర్ మండలం చించోలి(బీ) జడ్పీఎస్ఎస్ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ పోటీల్లో పాల్గొని జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపారు. ఓ వైపు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే, మరో వైపు ప్రయోగ పోటీల్లో పాల్గొనడం, ఉపాధ్యాయులకు సైన్స్‌పై శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ప్రాధాన్యత విస్తరిస్తున్నారు. అలాగే ఎస్ఎస్సీఈఆర్టీ ప్రచురించిన రైస్ అండ్ షైన్ పుస్తకంలో స్థానం సంపాధించుకున్నారు. సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ట్యాలెంట్ టెస్ట్‌లో ఇక్కడి విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దారు. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లను పొందేలా కృషిచేశారు.