నిర్మల్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): పదేళ్లలో ఎనలేని అభివృద్ధి సాధించిన నిర్మల్ జిల్లా.. ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. పట్టించుకునే వారు లేక జిల్లాలో ప్రగతి పూర్తిగా కుంటుపడే పరిస్థితి నెలకొన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ సర్కారు జిల్లా అభివృద్ధి కోసం నయా పైసా విడుదల చేయకపోవడంతో పనులన్నీ ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిన జిల్లా.. ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతున్నది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో మూడు మున్సిపాలిటీలు, 18 గ్రామపంచాయతీలు ఉన్నాయి. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని 4 మండలాలు నిర్మల్ జిల్లా పరిధిలోకి వస్తాయి.
ఆయా నియోజకవర్గాల పరిధిలో గతేడాదిగా ఎలాంటి అభివృద్ధి పనులు జరిగిన దాఖలాలు లేవు. కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అటు పంచాయతీలకు ఇటు మున్సిపాలిటీలకు ప్రతినెలా నిధులు మంజూరయ్యేవి. ఈ నిధులతో పారిశుధ్య పనులతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేవారు. వీటితో పాటు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్) క్రమం తప్పకుండా విడుదలయ్యేవి. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 జూన్ వరకు నియోజకవర్గానికి రూ.3 కోట్ల చొప్పున సీడీపీ నిధులను గత ప్రభుత్వం విడుదల చేసింది. నియోజకవర్గానికి రూ.10కోట్ల చొప్పున గతేడాది డిసెంబర్ వరకు ఎస్డీఎఫ్ నిధులను కేసీఆర్ ప్రభుత్వం క్రమం తప్పకుండా విడుదల చేసింది.
ఈ నిధులతో నియోజకవర్గాల వారీగా రోడ్లు, వంతెనలు, మురుగు కాలువలు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టేవారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది కాలంగా ఆయా పథకాల కింద జిల్లాకు నయా పైసా మంజూరు కాలేదని చెబుతున్నారు. 2023 డిసెంబర్ తర్వాత ఇప్పటి వరకు 11 నెలల కాలంలో జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కారు నయా పైసా విడుదల చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్డీఎఫ్ కింద నిధులు మంజూరయ్యాయని చెబుతున్నప్పటికీ.. పనులు చేసేందుకు కొందరు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దీంతో ఎస్డీఎఫ్ నిధులను వినియోగించే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
ఈ ఏడాది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) నయాపైసా విడుదల కాలేదు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నామమాత్రంగా రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరు మాత్రమే ఇచ్చారు. వీటికి సంబంధించి ఆయా శాఖల పరిధిలోని అధికారులు వివిధ పనుల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేశారు. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎస్డీఎఫ్ కింద ఎలాంటి పనులు మంజూరు కాలేదు. కేవలం ముథోల్ నియోజకవర్గంలో రూ.2 కోట్ల పనులకు ఆమోదం లభించింది. భైంసా పట్టణంలో మురుగు కాలువల నిర్మాణంతో పాటు సీసీ రోడ్లు, దేగాం సమీపంలో ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఈ నిధులను వెచ్చించనున్నారు.
ఆయా పనులను చేపట్టేందుకు సైతం కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. పంచాయతీరాజ్ శాఖలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మూడు నియోజకవర్గాల్లో కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువల కోసం ఆరు నెలల క్రితమే ప్రతిపాదనలు పంపారు. కొన్నింటికి ప్రభుత్వ ఆమోదం లభించినప్పటికీ పనులు మాత్రం పెద్దగా ముందుకు సాగడం లేదు. ఇప్పటికే చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో కొత్త పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సీడీపీ నిధులను సైతం విడుదల చేయలేదు. స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు తమ పరిధిలోనే నిధులు కేటాయించుకునేందుకు ఇవి ఉపయోగపడుతాయి. ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి రూ.3 కోట్ల సీడీపీ నిధులు ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో రూ. కోటి మాత్రమే ఉన్న నిధులను బీఆర్ఎస్ హయాంలో రూ.3 కోట్లకు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీడీపీ నిధులను విడుదల చేయకపోవడంతో ప్రజల కనీస అవసరాలు తీర్చే పరిస్థితి లేకుండా పోయింది.
ఎన్నికల వేళ ప్రజలకు అనేక హామీలను ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఎమ్మెల్యేల వద్ద నిధులు ఉంటే పలు ర కాల అభివృద్ధి పనులను చేసే అవకాశం ఉంటుంది. ము ఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల్లో సదుపాయాలు, నూతన భవనాలు, ప్రహరీలు, కమ్యూనిటీ భవనాలు, కమిటీ హాళ్ల వంటి వాటికి నిధులు కేటాయిం చే అధికారం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ని ధులు రాకపోవడంతో ఏ పని కూడా చేసే పరిస్థితి లేకుం డా పోయింది. దాంతో పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి కుం టుపడుతున్నది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయా యి. మొన్నటి వానకాలంలో భారీ వర్షాలకు చెడిపోయిన రోడ్లు, వంతెనలు, కల్వర్టులకు కనీసం మరమ్మతులు చే యించే పరిస్థితి లేదు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పల్లెల్లో తాగునీటి సమస్య నెలకొన్నా పరిష్కరించేవారు లేరు. ఇకఎన్నికల సమయం లో ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీల సంగతి దేవుడెరుగు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు నిధులు వరదలా పారాయి. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంట పడి మరీ నిధులను తీసుకొచ్చారు. సీడీపీతో పాటు ఎస్డీఎఫ్, టీయూఎఫ్ఐడీసీ నిధులను పెద్ద ఎత్తున విడుదల చేయించారు. అప్పటి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి కేసీఆర్, కేటీఆర్‌తో ఉన్న చనువు కారణంగా జిల్లా కేంద్రంగా మా రిన నిర్మల్‌కు పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చారు. ఒ క్క నిర్మల్ మున్సిపాలిటీకే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దాదాపు రూ.200 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొత్తగా ఖానాపూర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా అభివృద్ధి పనుల కోసం పెద్ద ఎ త్తున నిధులు మంజూరయ్యాయి.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా జనాభా ప్రాతిపదికన ప్రతి నెలా పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యేవి. నిర్మల్ మున్సిపాలిటీకి నెలనెలా రూ.82 లక్షలు నిధులు రావడంతో పట్టణంలో ఎప్పటికప్పుడు అవసరమైన పనులను చేపట్టే వారు. వీటితో పాటు మామడ మండలంలో సదర్మాట్ బ్యారేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు, హైలెవెల్ కాలువ పరిధిలోని ప్యాకేజీ- 27 పనుల కోసం రూ.700 కోట్లు విడుదలయ్యాయి. నిర్మల్ సమీపంలోని వెల్మల్ బొప్పారం వద్ద రూ.1200 కోట్లతో 400 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేశారు. కలెక్టరేట్ నిర్మాణానికి రూ.175 కోట్లు వెచ్చించారు. జిల్లా వ్యాప్తంగా రోడ్లు, వంతెనల కోసం దాదాపు రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. ఇలా అన్ని రంగాలకు నాటి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయడంతో నిర్మల్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోయింది.
కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. కేవలం పది నెలల్లోనే విఫల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది. ఆరు గ్యారెంటీలపై ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేల నిధులను కూడా విడుదల చేయకపోవడం దారుణం. అభివృద్ధి ఎలా ముందుకు సాగుతుంది. ఒక్క పైసా విడుదల చేయకపోవడమేనా ప్రజా పాలనా..? కాంగ్రెస్ మార్పు అంటే ఇదేనా..? ఇందుకేనా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించింది. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి ఏం లాభం..? వెంటనే అభివృద్ధి నిధులను విడుదల చేయించి పనులు చేపట్టాలి.
– భుక్యా జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, ఖానాపూర్