నిర్మల్ అర్బన్, ఆగస్టు 25 : ప్రజావాణి దరఖాస్తులను త్వరతగతిన పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. సోమవారం నిర్మల్ కలెక్టరేట్లో నిర్వహించిన ఫిర్యాదుల విభాగానికి హాజరై దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. మండలాలవారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మట్టి వినాయకుల పోస్టర్‌ను ఆవిష్కరించారు. మట్టి వినాయకులను పూజించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మీవాడలో గల డబుల్ బెడ్రూం ఇండ్లలో మూడు రోజులుగా నీటి సమస్య తలెత్తింది. నీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆ కాలనీవాసులు కలెక్టర్ అభిలాష అభినవ్‌కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులకు కాలనీలో నీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు.
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని హంపోలి గ్రామంలో పేదలకు ఇచ్చిన ప్రభుత్వ స్థలాల ను అక్రమంగా ఇతరులకు చేసిన పట్టాలను రద్దు చేయాలని, అదే స్థలం లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1983లో వరదల కారణంగా 16/ఆ,16/ఈ సర్వే నంబర్లో ఐదెకరాల పట్టా భూమి కొని ఎస్టీ, ఎస్సీలకు ఇండ్లు నిర్మించి ఇచ్చారన్నారు. ఆ భూమి లోని ఇండ్లను కూలగొట్టి, అక్రమంగా పట్టాలను చేయడం జరిగిందని, ఆ పట్టాలను రద్దు చేయాలని నివేదికలు పంపిన రద్దు కాలేదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి హరిత పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న బెస్ట్ అవైలెబుల్ పాఠశాలలో 1 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఖాళీగా ఉన్న సీట్లతో పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, వెంటనే భర్తీ చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రంజిత్ కోరారు.