ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర(Nagoba Jatara) ఆదివారం అర్ధ రాత్రి నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. తమ అరాధ్యదైవం నాగోబా దేవతకు ఆదివారం మెస్రం వంశీయులు అర్థరాత్రి మహాపూజ నిర్వహించి అనంతరం నాగోబా జాతర మొదలవ్వనుంది. ఇప్పటికే జాతర కోసమని జన్నారం మండలం హస్తినమడుగు నుండి సేకరించిన పవిత్ర గంగాజలం తీసుకొచ్చారు మెస్రం వంశస్తులు.
కేస్లాపూర్ గ్రామంలోని మురాడీ నుంచి పురాతన నాగోబా విగ్రహంతోపాటు పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు నాగోబా ఆలయానికి చేరుకున్నారు. పురాతన నాగోబా విగ్రహాన్ని ఆలయంలోని విగ్రహం వద్ద పేట్టి మొక్కుకున్నారు. నాగోబా ఆలయం వెనుక భాగంలో పవిత్రమైన గంగాజలం ఝరిని భద్రంగా ఉంచారు. అనంతరం మెస్రం వంశీయుల పెద్దలు 22 కీతలకు చెందిన అడపడుచులకు మట్టి కుండలను పంపిణీ చేశారు.
మట్టి కుండలో మహిళలు మర్రిచెట్ల వద్ద ఉన్న నీటి కోనేరుకు చేరుకొని పూజలు నిర్వహించి కోనేరు నుంచి కుండల్లో నీటిని సేకరించి నాగోబా ఆలయానికి చేరుకున్నారు. మెస్రం వంశీయుల అల్లుళ్లు నాగోబా ఆలయం వద్ద ఉన్న పుట్టలను తవ్వారు. ఆ మట్టితో మెస్రం వంశీయుల అడపడుచులు నూతన పుట్టలను తయారు చేశారు. అదే మట్టితో ఉండలు చేసి బౌలదేవతను తయారు చేసి అర్ధరాత్రి పూజలు చేయనున్నారు.
నాగోబాకు మహా పూజలు చేసిన అనంతరం భేటింగ్ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కొత్త కోడళ్లకు మెస్రం వంశీయుల అడపడుచులు సతీ దేవతతో పాటు నాగోబాకు పూజలు చేయిస్తారు. అనంతరం మెస్రం వంశీయుల పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు.
మెస్రం వంశీయులు నిర్వహించనున్న నాగోబా మహాపూజలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, అనిల్ జాదవ్, పాయల శంకర్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొననున్నారు.