మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 23 : మా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులన్నీ ప్రత్యేక చొరవ చూపి పూర్తిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కోరారు. సీఎం మంచిర్యాల పర్యటన నేపథ్యంలో ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన అనేక అభివృద్ధి పనులను కాంగ్రెస్ సర్కారు రద్దు చేసిందని, వాటిని వెంటనే పునఃప్రారంభించాలని కోరారు.
మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జిని మంచిర్యాల గోదావరి మీది నుంచే నిర్మించాలని, రూ.164.00 కోట్లతో మంజూరు, అగ్రిమెంట్ అయిన బ్రిడ్జి పనులను మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని, దీని వలన హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ప్రయాణం చేసే వారికి 18 కి.మీ. దూరం తగ్గుతుందన్నారు. కానీ, స్థానిక ఎమ్మెల్యే ఈ బ్రిడ్జిని ములల్ల నుంచి ముర్మూర్ మీదుగా నిర్మించాలని ప్రతిపాదన చేస్తున్నారని, ములల్ల నుంచి ముర్మూర్ మీదుగా అంతర్గాం వరకు గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపడితే రూ.450.00 కోట్ల ఖర్చు పెరగడమేగాక, 8 కి.మీ. మేర భూ సేకరణ చేయాల్సి ఉంటుందని, ఇవన్నీ చేసినా హైదరాబాద్ వెళ్లడానికి కేవలం 5 కి.మీ దూరం మాత్రమే తగ్గుతుందన్నారు.
కావున ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకొని గతంలో మాదిరిగానే మంచిర్యాల – అంతర్గాం మధ్యనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. 5 కిలోమీటర్ల దూరం తగ్గడానికి రూ.450 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టడము అవసరమా ? అని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదిలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు నేతృత్వంలో ఇసుక, మట్టిని తోడి అక్రమంగా వందలాది లారీల్లో తరలించి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మంచిర్యాలను మాఫియా మంచిర్యాలగా మార్చారని, అతని ఆగడాలను నియంత్రించి మంచిర్యాలను కాపాడాలని కోరారు.
గడిచిన 15 నెలల్లో మంచిర్యాలలో ఎకడ చూసినా దా డులు, కొట్లాటలు, తప్పుడు కేసులు పెట్టడమే తప్ప ఎమ్మెల్యే చేసిందేమీ లేదని, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు.. ఇలా ఎవరు తనకు ఎదురు మాట్లాడినా అక్రమ కేసులతో జైల్లో పెట్టిస్తున్నాడని, తన మనుషులతో కొట్టిస్తున్నాడని ఆరోపించారు. మంచిర్యాలలో కొనసాగుతున్న సంస్కృతిని సీఎం దృష్టికి తీసుకువస్తున్నామని, ఇకనైనా మార్పురాకపోతే బీఆర్ఎస్ పార్టీ పరంగా ఉద్యమాలు చేపడుతామని చెప్పుకొచ్చారు.
ఐటీ పార్ పేరిట దళితుల భూములను ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు లాక్కుంటున్నారని, వేంపల్లి గ్రామ శివారులో ఇండస్ట్రియల్ హబ్, ఐటీ పార్ ఏర్పాటు కోసం సేకరిస్తున్న 300 ఎకరాల భూమికి, ఎకరానికి రూ. 13 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడం దా రుణమన్నారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్నప్పటికీ పరిహారం తకువగా నిర్ణయించారని, ప్రస్తుతం అకడ పట్టా భూమికి ఎకరానికి రూ. 50 లక్షల వరకు పలుకుతుందన్నారు. దళిత రైతులను బెదిరించి, రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఓ ఫంక్షన్ హాల్‌కు రైతులను పిలిపించి మాయమాటలు చెప్పి, భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా వారి భూములను తీసుకోవడం దారుణమన్నారు.
ఇది కేవలం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు లబ్ధి పొందడానికి మాత్రమే చేస్తున్న ప్రక్రియ అని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ రైతుల పక్షాన పోరాడుతామని, వారికి అండగా ఉంటామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ , మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు తోట తిరుపతి, తాజొద్దీన్, శ్రీరాముల మల్లేశ్, జాఫర్, గరుగంటి కొమురయ్య, మహ్మద్ రఫీ, కర్రు శంకర్, పడాల రవీందర్, పడాల శ్రీనివాస్, పెంట ప్రదీప్, నస్పూరు పట్టణ అధ్యక్షుడు అకురి సుబ్బన్న, మాజీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ, నాయకులు మెరుగు పవన్, బండారి తిరుపతి, వడ్లకొండ రవి గౌడ్, కాటంరాజు మహమ్మద్ సాజిద్ పాల్గొన్నారు.