ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 21 : వేద పండితుల సూచనలతో ఈ నెల 23వ తేదీన నిర్వహించే దసరా ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్ పట్టణం దస్నాపూర్‌లోని దసరా మైదానంలో ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు, హిందూ సమాజ్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి పరిశీలించారు. ముందుగా వేడుకల ఏర్పాట్ల పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు దసరా నవరాత్రోత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటాలాగే దసరా ఉత్సవాల ఆహ్వానంగా స్వీకరిస్తూ ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. పట్టణాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దుతూ చౌక్‌లతో పాటు, బ్యూటిఫికేషన్‌ను ఏర్పాటు చేసుకొని హైమాస్ లైట్లతో ఆదిలాబాద్ నూతన హంగులతో స్వాగతం పలకనుందన్నారు. పట్టణ ప్రజలు ఆకట్టుకునేలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో హిందూ సమాజ్ అధ్యక్షులు ప్రమోద్‌కుమార్ ఖత్రి, హనుమాన్లు, కోశాధికారి లెనిన్, ఉదయ్ గంగేవార్, శ్రీరామ్ శర్మ, విశ్వనాథ్, వార్డ్ కౌన్సిలర్ భరత్, దమ్మాపాల్ పాల్గొన్నారు.