సోన్, ఫిబ్రవరి 15 : అన్నదాతలకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, సోన్ మండలాల్లో ఆదివారం పలు ఫర్టిలైజర్ షాపు ల్లో యారియా నిల్వలను యాప్ లో చూడగా ‘జీరో’ చూపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వరిలో కలుపు తీత తర్వాత, మక్క పంట కంకి దశ లో ఉన్నదని సకాలంలో యూ రియా వేస్తేనే పంట ఎదుగుతుందని, ఇప్పుడు యారియా అందకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో యూరియా కోసం ఎలాం టి ఇబ్బంది లేకుండా అందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో యారియా కోసం అవస్థలు పడుతున్నామని వాపోయారు.
నిర్మల్ జిల్లాలోని వరి, మొక్కజొన్న, తదితర పంటల ను పండిస్తారు. ఇప్పుడు వరి కలుపుతీత తర్వాత యూరియా చల్లుకొనే రైతులకు, మొక్కజొన్న కంకి దశలో ఉండటంతో వరి, మొక్కజొన్న రైతులు యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని ఆయా ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎక్కడ కూడా యూరియా నిల్వలు చూపించకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సకాలంలో యూరియా అందకపోతే పంటల దిగుబడి రాక అప్పుల పాలవుతామని దిగులు చెందుతున్నారు. ఇతర మండలాల్లోని షాపుల నుంచి తీసుకోవాలంటే రవాణా ఖర్చులు రానుపోనుకు తడిసిమోపు అవుతాయని రైతులు వాపోతున్నారు.
యూరియా లోడ్ ఫర్టిలైజర్ దుకాణానికి వచ్చాక డీలరు ఆన్లైన్లో నమోదు చేసిన పది నిమిషాల్లోనే అందుబాటులో వారు ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని తీసుకెళ్తున్నారని, మిగతా వారికి దొరకక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. లోడ్ వచ్చాక డీలర్ ఆన్లైన్లో నమోదు చేస్తేనే యాప్లో నిల్వలున్నట్లు చూపిస్తున్నాయని, లోడ్ వచ్చిన సమాచారం డీలర్ ద్వారా తెలుసుకున్న రైతులకే ముందుగా దొరుకుతుందని చెబుతున్నారు. సమయానికి బుకింగ్ చేయని వారికి నిరాశే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులకు రైతుబంధుతో పాటు ఎరువులు అందుబాటులో ఉంచడంతో రైతులకు యూరియా కష్టాలు కనిపించలేదన్నారు. ప్రస్తుతం రెండున్నర కాంగ్రెస్ పాలనలో ఆది నుంచి యూరియా కష్టాలను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. దీనికి తోడు యూరియాను బుకింగ్ కోసం యాప్ను తీసుకురావడంతో స్మార్ట్ ఫోన్ లేక తిప్పలుపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యారియాను సకాలంలో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
యూరియా కొరత విషయమై నిర్మల్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్ను వివరణ కోరగా జిల్లాలో 41వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు 36వేల మెట్రిక్ టన్నులు రైతులకు అందించినట్లు తెలిపారు. మరో 5వేల మెట్రిక్ టన్నులు యూరియా మార్క్ఫెడ్, ప్రైవేటులో అందుబాటులో ఉందని రెండు రోజుల్లో రైతులకు అందుబాటులో వస్తాయని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
– అంజి ప్రసాద్, నిర్మల్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి
