మహబూబ్‌నగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చేపడుతున్నది ఇండస్ట్రియల్ కారిడార్ కాదని, ఏదో పెద్ద దోపిడీ కారిడార్ అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం దుద్యాల మండలం హకీంపేట చౌరస్తాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు పేరుతో జరుగుతున్న భూ పరిహారం దోపిడీని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా భూ బాధితులతో కలిసి పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దఎత్తున అభివృద్ధి చేశామని చెప్పుకొంటున్నారు కానీ, అక్కడ జరిగింది మాత్రం పెద్ద ఎత్తున దోపిడీయేనని దుయ్యబట్టారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూములు లాక్కున్నారని మండిపడ్డారు.
ఇప్పటివరకు ఏ కంపెనీ ఇక్కడికి వచ్చిందో ముఖ్యమంత్రి ప్రజల ముందు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. కారిడార్ పేరుతో వేల కోట్ల రూపాయలు సీఎం రేవంత్‌రెడ్డికి, తిరుపతిరెడ్డికి ముట్టాయని, రూ.100 కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకు ముట్టాయని ఆరోపించారు. పేద రైతులను బెదిరించి, పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో భారీఎత్తున పరిహారాన్ని పక్కదారి పట్టించారని విమర్శించారు. 15 ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలకు, రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి పరిహారం ఇచ్చి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద జరిగిన పరిహారం కుంభకోణంపై జ్యుడీషియ ల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే, కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులు పరిహారం అడిగితే వారి కుటుంబ స భ్యులను, మహిళలను పోలీస్ స్టేషన్లలో పె ట్టించి కొట్టించిన ఘనత కాంగ్రెస్ నాయకులకే దక్కిందని మండిపడ్డారు. పోలీస్ అధికారు లు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయక పోతే పరిస్థితి మరోలా ఉంటుందని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.
బీఆర్ఎస్ రాస్తారోకోకు భారీ స్పందన
కొడంగల్ నియోజకవర్గం హకీంపేట చౌరస్తాలో మంగళవారం చేపట్టిన బీఆర్ఎస్ ధర్నా విజయవంతమైంది. హకీంపేట సమీపంలో ఏర్పాటుచేస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన భూ పరిహారం పంపిణీలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో బాధిత రైతులు పాల్గొని తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ రాస్తారోకో చేపట్టడంతో భారీఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ముం దుగా దుద్యాల ఎస్సై శ్రీశైలం ఆధ్వర్యంలో కొంతమంది పోలీసులు రాస్తారోకోను అడ్డుకొనే ప్రయత్నం చేయగా, బీఆర్ఎస్ నాయకులు, బాధితులు అడ్డం తిరిగారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇన్చార్జ్ సీఐ కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీఎత్తున పోలీస్ బలగాలు అక్కడికి చేరుకొన్నాయి. శాంతియుతంగా ఆందోళనచేస్తున్నామని, తమను అడ్డుకోవద్దని పట్నం మహేందర్‌రెడ్డి పోలీసులను పదేపదే కోరారు.
తాము ఎవరికీ వ్యతిరేకంకాదని, భూములు ఇచ్చిన బాధితులకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నామని పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నదని, అనుమతి లేకుండా రాస్తారోకో చేస్తే కేసులు నమోదు చేస్తామని దుద్యాల ఎస్సై హెచ్చరించారు. దీంతో ఇటీవల కొడంగల్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అరెస్టుకు నిరసనగా ఆందోళన చేశారని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు. అప్పుడులేని పోలీస్ యాక్ట్ బాధితులకు న్యాయం చేయాలని కోరితే గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉన్న బాధితులను, బీఆర్ఎస్ నాయకులను చూసి పోలీసులు అడుగడుగునా వీడియోలు తీస్తూ రాస్తారోకోకు అనుమతించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేశ్‌గౌడ్, మహిపాల్, శివకుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, యాదగిరి, మహిపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సాయికుమార్, బసప్ప, యాదయ్య, రాఘవేందర్, రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.