Delhi Airport : ఢిల్లీ ఎయిర్పోర్టులో భద్రతా లోపం బయటపడింది. సరైన ఇమ్మిగ్రేషన్ అనుమతులు లేకుండానే ముగ్గురు విదేశీయులు దేశం విడిచివెళ్లిపోయారు. దీంతో మరోసారి మన భద్రతా ప్రమాణాలపై చర్చ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి.ఇటలీకి చెందిన ముగ్గురు పౌరులు ఇండియాలో పర్యటించారు. వారు పంజాబ్ (అమృత్సర్) నుంచి విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి ఎయిర్పోర్టు నుంచి తిరిగి లుఫ్తాన్సా సంస్థకు చెందిన విమానంలో ఇటలీలోని మ్యునిచ్ చేరుకున్నారు.
అయితే, ఈ ముగ్గురు ఇటాలియన్ ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లభించలేదు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి కాకుండానే ముగ్గురూ ఇండియా విడిచి వెళ్లిపోయారు. ఈ ఘటన సెప్టెంబర్ 3-4 మధ్య రాత్రి పూట జరిగింది. వీరు ముగ్గురు ఎయిరిండియా విమానంలో అమృత్సర్ నుంచి రాత్రి 12.50 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. గంట తర్వాత ఢిల్లీ నుంచి బయల్దేరి మ్యునిచ్ వెళ్లిపోయారు. నిబంధనల ప్రకారం డొమెస్టిక్ ఎయిర్పోర్టులకు చేరుకున్న ప్రయాణికులు విదేశాలకు వెళ్లాలనుకుంటే అంతర్జాతీయ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. లగేజ్ చెక్ చేయడం, పాస్పోర్టు, ఇతర డాక్యుమెంట్లు పరిశీలించడం చేసిన తర్వాతే అనుమతులివ్వాలి.
అయితే, ఈ ముగ్గురు ప్రయాణికులకు అలాంటిదేమీ జరగలేదు. పైగా వీరికి ఢిల్లీ వస్తున్నప్పుడు డొమెస్టిక్ బోర్డింగ్ పాసెస్ ఇచ్చారు. అలాగే, లుఫ్తాన్స్ విమానానికి సంబంధించిన బోర్డింగ్ పాసెస్ కూడా ఇచ్చారు. నిజానికి ఇలా ఇవ్వడం కురదదు. ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ పూర్తైన తర్వాతే బోర్డింగ్ పాస్లు ఇవ్వాలి. కానీ, వాళ్లు నేరుగా ఇంటర్నేషనల్ జోన్కు వెళ్లిపోయి, విమానం ఎక్కేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడంలో ఎయిరిండియా సంస్థ పాత్ర కూడా ఉంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర విమానయాన శాఖ ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుగుతోంది.