హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను తెలుసుకునేందుకు ఈనెల15 నుంచి 27వ తేదీ వరకు విద్యారంగ బస్ యాత్ర ( Education Bus Yatra) ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (TPF) ప్రతినిధి అకునూరి మురళి ( Akunuri Murali ) వెల్లడించారు. ఈ యాత్ర రెండు దశల్లో ఒక్కో దశలో 5 జిల్లాల చొప్పున జరుగుతుందని వివరించారు. తొలిరోజు మంగళవారం ఉదయం 10.30 గంటలకు పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి మొదలవుతుందని వెల్లడించారు.
ఈ యాత్ర తెలంగాణలోని మొత్తం పూర్వ పది జిల్లాలను కవర్ చేస్తుందన్నారు. యాత్ర బృందం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, స్థానికులతో, ముఖ్యంగా తల్లిదండ్రుల తో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటుందన్నారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో, విద్యావేత్తలతో, అక్టీవిస్టులతో, స్వచ్చంద సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తుందన్నారు.
ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఫీజులను నియంత్రించి, పర్యవేక్షిం చేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, రాష్ట్ర బడ్జెట్లో18 శాతం నిధులను విద్యకు కేటాయించేలా చట్టాలు తీసుకురావాలన్నారు.
యాత్ర బృందంలో ప్రొఫెసర్ పద్మజా షా, మాజీ ఐఏఎస్లు ఎం. వి. రెడ్డి, ఎం. చంపాలాల్, ఎన్. రుబీనా, తమ్మినేని నిర్మల, సృజన యాదవ్, ముప్పూరి కుమారన్న, నిఖిల్ విజయ కృష్ణ, పాలకూరి అశోక్ కుమార్ ఉంటారని వె ల్లడించారు.