ఆదిలాబాద్ : రేపు (మంగళవారం) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి దండె విఠల్, ఇండిపెండెంట్ అభ్యర్థి పుష్పరాణిలు పోటీ పడుతున్నారు. ఈ నెల 10న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగగా 91.78 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు 937 మంది ఉండగా 862 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఇద్దరు ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్‌కు నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అభ్యర్ధి దండె విఠల్ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని టీఆర్ఎస్ నాయకులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.