మంచిర్యాల, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “చెన్నూర్ నియోజకవర్గంలో ఎవ్వరు కూడా బియ్యం దందా.. భూ దందా.. ఇసుక దందాలు చేయవద్దు. ఈ విషయంలో పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంది.. నిజనిజాలు బయటపెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. దందాలు చేసేటోళ్లు ఎంత పెద్దవారైనా విడిచిపెట్టేది లేదు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దు. ఇందారంలో ఇసుక తీసేటోళ్లు నా పేరు చెబుతున్నరంటున్నరు. నేను ఎవరికీ ఇసుక తీసుకెళ్లమని చెప్పలేదు. వే బిల్లులు ఉన్న లారీలు మాత్రమే రోడ్ల మీదకు రావాలి. జీరో లారీలు కనిపిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తున్నా.” అంటూ తెగ ప్రచారం చేసుకున్నారు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్.
ఆయన మాట్లాడిన వీడియోను పార్టీ లోగోతో సహా సోషల్ మీడియాలో జోరుగా వైరల్ చేశారు హస్తం లీడర్లు. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో జరిగే ఇసుక అక్రమ రవాణాకు అప్పుడున్న ఎమ్మెల్యే బాల్కసుమనే కారణమంటూ.. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం వివేక్ తప్పుడు ప్రచారం చేశారు. మరి అప్పుడున్న ఎమ్మెల్యే ఇసుక దందా చేస్తే.. ఇప్పుడు జరుగుతున్న అక్రమ రవాణా వెనుక ఎమ్మెల్యే వివేక్ ఉన్నట్లేనా.. అనే చర్చ ప్రస్తుతం చెన్నూర్ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నది. ఎలాంటి దందాలు చేయనివ్వనని చెప్పిన ఎమ్మెల్యే సారు.. మరి ఇప్పుడు వేలాల కేంద్రంగా జరుగుతున్న అక్రమ ఇసుక దందాపై ఏమని సమాధానం చెబుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
చెన్నూర్ నియోజకవర్గంలోని జైపూర్ మండలం వేలాల, కిష్టాపూర్ శివారులోని క్వారీ ఇరిగేషన్ క్వారీ. కేవలం ఇరిగేషన్ అవసరాలకు మాత్రమే ఇక్కడి నుంచి ఇసుక తవ్వాలి. పైగా ఇసుక తరలించే వాహనాలపై ఇరిగేషన్ అనే ఫ్లెక్సీ ప్రదర్శించాలి. కానీ ప్రస్తుతం మైనింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చిన చోట కాకుండా ఇరిగేషన్ పేరు చెప్పి వేరే ప్రాంతాల్లో ఇసుక తీసి ప్రైవేటుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక క్వారీ నడపాలి. కానీ అర్ధరాత్రుళ్లు, తెల్లవారుజూమున సైతం లారీలు రోడ్లపైకి వస్తున్నాయి.
రాత్రీ.. పగలు అనే తేడా లేకుండా 24 గంటల పాటు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, అవి కూడా జీరోగా కొడుతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయాల నష్టం జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందనే విమర్శలు సైతం వ్యక్తవుతున్నాయి. పర్మిషన్ ఉందని చెప్పుకుంటూ.. అనుమతి తీసుకున్న దగ్గర కాకుండా మరో చోట ఇసుక తీస్తున్నారని, వే బిల్లులు లేకుండా జీరో కొడుతున్నారని స్థానిక నాయకులు సైతం ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో వేలాల మాజీ ఎంపీటీసీ జాడి యేసయ్య కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతున్నది.
ఇందారం గోదావరిలో ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేసినప్పడు.. దాని వెనుక నేను లేనని.. నియో జకవర్గంలో ఎలాంటి ఇసుక దందా చేయొద్దని ఎమ్మెల్యే వివేక్ చెప్పారు. మరి ఇప్పుడు ఇంత దర్జాగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు. దందా సా గుతున్న తీరును ఎమ్మెల్యే వేలాలకు వచ్చి చూడా లి. ఎమ్మెల్యే ప్రమేయం లేకపోతే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి. ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న విషయాన్ని అధికారులు గుర్తించాలి. లేనిపక్షంలో రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.
– జాడి యేసయ్య, మాజీ ఎంపీటీసీ వేలాల