ఆదిలాబాద్ నమస్తే తెలంగాణ, ఆగస్టు 20 : తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదేండ్ల అనతికాలంలోనే రాష్ట్ర సర్కారు అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విశేష ప్రజాదరణ పొందాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. 68 ఏండ్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజా సంక్షేమానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలో నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 200 మంది మహిళలు, యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆటో యూనియన్, నాయక్ పోడ్ సంఘాల ప్రతినిధులతోపాటు గ్రామస్తులు పార్టీలో చేరారు.
అంతకుముందు ఆటో స్టాండ్ నిర్మాణానికి భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన అనతికాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాట నడుస్తున్నదన్నారు. గతంలో అంకోలి గ్రామానికి రావాలంటే సరైన మార్గం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు. మారుమూల గ్రామాలకు సైతం రహదారి సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యలకు పరిష్కారమార్గం చూపామని స్పష్టం చేశారు. కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసే స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, గతంలో పాలించిన కాంగ్రెస్ సైతం బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేశ్, సర్పంచ్ భూమన్న, రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ రోకండ్ల రమేశ్, మెస్రం పరమేశ్వర్, సెవ్వ జగదీష్, కనక రమణ, మడావి కిషన్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన చేరికల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణా అండ్ జనరల్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బంగడుపుకోవాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తున్నదని, వారిని నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కిరాణా అండ్ జనరల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబా సాహెబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పార్టీ పట్టణాధ్యక్షుడు అలాల్ అజయ్, నాయకులు సాజీదొద్దీన్, మమ త, స్వరూపారాణి, అనసూయ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం రూ.5లక్షలో నిర్మించనున్న కమ్యునిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సాహిత్య రంగానికి అత్యంత విలువైన సేవలందించిన అన్నాభావు సాఠేకు భారత రత్న బిరుదు అందించాలన్నారు. మహారాష్ట్రంలో జరిగిన అన్నాభావు సాఠే జయంతి వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరై, ఘన నివాళులర్పించిన విషయానిన గుర్తుచేశారు. సమాజ హితం కోసం పాటుపడిన మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు విద్యా బుద్ధులు నేర్పాలని, మెరుగైన సమాజాన్ని నిర్మించేలా పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దీపక్మోరే, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అక్బానీ, ఇస్రార్, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.