Adilabad | ‘గత ప్రభుత్వాలు పర్దాన్ కులస్తులను ఓట్ల కోసమే వాడుకున్నాయి. కానీ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అభివృద్ధికి కేసీఆర్ పాటుపడుతున్నారు.’ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో ఆదివాసీ పర్దాన్ సమాజ్ ఆధ్వర్యంలో హీరాసుక జయంతి వేడుకలు నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామన్న, ఆదిలాబాద్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్దన్, విఠల్‌రావు, పర్దాన్ సమాజ్ జాతీయ అధ్యక్షుడు కేపీ పర్దాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు, వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
– ఎదులాపురం, ఫిబ్రవరి 28
ఎదులాపురం, ఫిబ్రవరి28: ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంలో ఆదివాసీ పర్దాన్ సమాజ్ ఆధ్వర్యంలో మంగళవారం హీరాసుక జయంతి నిర్వహించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఆదిలాబాద్, నిజామబాద్ జడ్పీచైర్మన్లు రాథోడ్ జనార్ధన్, విఠల్ రావు, పర్దాన్ సమాజ్ జాతీయ అధ్యక్షుడు కేపీ పర్దాన్ వేడుకలకు హాజరయ్యారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడారు. పర్దాన్లకు ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు అప్పగించిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నామినేటెడ్ పదవులల్లో రిజర్వేషన్లు అమలు చేసి వారికి గుర్తింపు ఇచ్చింది సీఎం కేసీఆరేనని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు పర్దాన్ల అభ్యున్నతి, సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. ఆదిలాబాద్ జిల్లా కోసం ప్రత్యేక జీవోను తీసుకువచ్చి ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పారు. పర్దాన్ కులస్తులకు తర్వలోనే రెండెకరాల భూమి ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని తండాలు, గూడేలకు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నదని తెలిపారు. రూ.73కోట్లతో రోడ్లు వేశామని, అవసరం ఉన్న చోట మరిన్ని బీటీ రోడ్లు వేస్తామన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ గిరిజనబంధు ప్రకటించారని, త్వరలోనే అర్హులందరికీ రూ.10లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, పర్దాన్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు దుర్వ నగేశ్, డివిజన్ అధ్యక్షుడు గోడం గంగారాం, గోడం సునీల్, రాకేశ్, గంగప్రసాద్, ఎం తిరుపతి, వివిధ మండలాలతో పాటు, మహారాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జడ్పీ చైర్మన్‌కు సన్మానం
నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్న విఠల్‌రావు మొదటిసారి ఆదిలాబాద్ జిల్లాకు రాగా, జడ్పీ కార్యాలయంలో చైర్మన్ జనార్దన్ రాథోడ్ సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజు, జడ్పీ సీఈవో గణపతి, డిప్యూటీ సీఈవో రాజేశ్వర్, జీవ వైవిద్య మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు వెంకట్ రెడ్డి, మణికంటేశ్వర్రావు ఉన్నారు.
విద్యార్థులు రాణించాలి
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 28 : పట్టణంలోని మహ్మదీయ ఉర్దూ పాఠశాల వార్షికోత్సవాన్ని జిల్లాకేంద్రంలోని టీఎన్జీవోస్ సంఘ భవనంలో మంగళవారం నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.