ఎదులాపురం, ఏప్రిల్ 19 : తరోడ బ్రిడ్జి విషయాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలంలోని తరోడ బ్రిడ్జి ప్రకృతి వైపరీత్యాలతో పూర్తిగా దెబ్బ తిన్న నేపథ్యంలో రాకపోకలు నిలిపివేశారు. కాగా లారీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో స్థానిక బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జోగు రామన్న అక్కడికి చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి వద్ద ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు ఆడ, కంట గ్రామాల మీదుగా చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనుల గురించి సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
తరోడ బ్రిడ్జి రెండేళ్ల కిందటే కేంద్రం పరిధిలోకి వెళ్లిందని, దీని నిర్మాణం పూర్తి కావడానికి మరో రెండేండ్లు పట్టే అవకాశం ఉందని తెలిపారు. రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా రూ.39 లక్షలతో ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించనున్నామని, అందుకు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. బీజీపీ నాయకులు ఈ విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడడం సమంజసం కాదన్నారు. కేంద్రం పరిధిలో ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని స్థానిక సమస్యగా చిత్రీకరిస్తున్నారని, ఇప్పటి వరకు ఎంపీ కనీసం బ్రిడ్జి వద్దకు కూడా రాలేదని మండిపడ్డారు. అధికారులు, కేటీసీ కంపెనీ వారు జేసీబీలతో పని చేయిస్తే బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ చేయించినట్లు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి ఉన్నారు.
చలివేంద్రం ప్రారంభం
ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 19 : ఆదిత్య ఖందేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో నేతాజీ చౌక్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎ మ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. అనంతరం స్థానికుల కు తాగునీటిని అందజేశారు. సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య ఖందేష్కర్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్ ఖత్రి, కౌన్సిలర్ ప్రకాశ్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.