పెంబి, జూన్ 3 : కాంగ్రెస్ పార్టీ సంస్థగత, నిర్మాణ సన్నాహక సమావేశంలో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ పరిశీలకులు యండి అవేజ్, చంద్రశేఖర్ గౌడ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచనలు చేశారు. ఈ సమావేశానికి హాజరైన కార్యకర్తలు, రైతులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసినప్పటికీ కార్యక్తలకు సమూచిత స్థానం కల్పించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, మండల నాయకులు, కార్యక్తలను పట్టించుకోవడంలేదని వాపోయారు. ప్రభుత్వం పోడు భూములను లాక్కోవాలని చూస్తున్నదని, సమావేశానికి వచ్చిన పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవనాధారమైన పోడు భూములు లాక్కుంటే రోడ్డున పడుతామని, పోడు భూముల్లో మొక్కలు నాటే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు స్వప్నిల్ రెడ్డి, నాయకులు తులాల శంకర్, స్వామి పాల్గొన్నారు.