ఇంద్రవెల్లి : మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, శాస్త్రవేతల సలహాలతో పంటలు సాగు చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ హెచ్చరించారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామంలోని రైతు వేదిక భవనంలో రైతు ముంగిట్లో శాస్త్రవేతలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయ సాగుపై దృష్టి సారించాలని అన్నారు.
రసాయన ఎరువుల వాడకం వల్ల భూకాలుష్యం పెరిగి, మానవ మనుగడకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పురాతన కాలంలో పండించిన పంటలను మళ్లీ సాగు చేయాలని సూచించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా కాకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేతలు, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.