తాంసి, జూలై 12: బోథ్ నియోజకవర్గంలోని ప్రాచీన ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (Anil Jadhav) తెలిపారు. తాంసి మండల కేంద్రంలోని శివంబి కేశవ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షల ప్రొసీడింగ్ కాపీని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలవే కాదు, సాంస్కృతిక పరంపరను కొనసాగించేవి కూడా. వాటిని అభివృద్ధి చేయడం ద్వారా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది, ప్రజల్లో ఐక్యత, సాన్నిహిత్యం మరింత బలపడుతుందన్నారు. అలాగే దేవాలయాల అభివృద్ధి గ్రామీణ పర్యాటకానికి కూడా తోడ్పడుతుందని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని ప్రధాన ఆలయాలకు నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయాల చుట్టూ పారిశుధ్యం, విస్తరణ, సౌకర్యాల కల్పన, ఆవరణ లో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని, తద్వారా భక్తులకు మరింత సౌకర్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికులు కూడా ఈ ప్రోత్సాహక చర్యల వల్ల ఆనందం వ్యక్తం చేస్తూ, గ్రామంలోని పాత దేవాలయాల రూపురేఖలు మార్చి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకాల్లో లేకుంటే నమోదు చేసుకునేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని పలు ఆలయాలకు నిధులు మంజూరు చేయడంతో స్థానిక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్, మాజీ ఎంపీటీసీ కౌడాల లక్షీ మహేందర్, ఖోడద్ మాజీ సర్పంచ్ ఆనంద్ రావు, నాగ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు