బజార్ హత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చట్ల గజ్జయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ గోడం నగేష్ బజార్ హత్నూర్‌లో నిర్వహించిన ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు చట్ల గజ్జయ్య భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తమ కోసం ఎంతగానో కష్టపడ్డ గజ్జయ్య లేరన్న వార్త తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. గజ్జయ్యతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ తరపున గజ్జయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. వీరితో పాటు బోథ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.