మందమర్రి, సెప్టెంబర్ 21: సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరి పోయిందని ఫలితంగా కార్మికులకు లాభాల వాటా పంపిణీలో అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మందమర్రి పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది సంస్థకు వచ్చిన నికర లాభాల్లో 33 శాతం వాటాను కార్మికులు, ఉద్యోగులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు రూ.4701 కోట్లు లాభాలు వస్తే 2,289 కోట్ల రూపాయలను సంస్థ అభివృద్ది, కార్మిక సంక్షేమం పేరిట పక్కన పెట్టి కేవలం 2,412 కోట్ల రూపాయల్లో మాత్రమే 33 శాతం పంపిణీ చేయడం అన్యాయమన్నారు.
నికర లాభాల మొత్తం మీద ఎందుకు వాటాను పంచడం లేదని ఆయన ప్రశ్నించారు. వాస్తవ లాభాల్లో అయితే కార్మికులకు దాదాపు రూ.1551కోట్లను పంచాల్సి ఉందని దీంతో ఒక్కో కార్మికుడికి సుమారు 3 నుంచి 4 లక్షల వరకు వాటా అందుతుందని తెలిపారు. రూ.2289 కోట్లను సింగరేణి సంస్థ భవిష్యత్ ప్రణాళిక, భవిష్యత్ తరాలు, అభివృద్ధి, సంక్షేమ కోసం పక్కన పెట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిలుక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ బొగ్గు గని కార్మికులకు లాభాల వాటా పెంచి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని గుర్తు చేశారు. 33 శాతం లాభాల వాటాను సాధించేందుకు టీబీజీకేఎస్ చేసే పోరాటానికి కార్మికులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, కేంద్ర ఉపాధ్యక్షుడు నూనె కొమురయ్య, జే.రవీందర్, డిఫ్యూటీ ప్రధాన కార్యదర్శి ఓ.రాజశేఖర్, వెంకటరమణ, ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, బడికెల సంపత్, దాసరి శ్రీనివాస్, ఈశ్వర్, రవి యాదవ్, సీపెల్లి రాజలింగు, కనవేని శ్రీనివాస్, పాణి ప్రతాప్, కోరబోయిన లక్ష్మణ్ పాల్గొన్నారు.