ఆదిలాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ) : వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రా ష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి మూతపడిన సిమెం టు పరిశ్రమను పరిశీలించారు. పరిశ్రమ ప్రారంభానికి ప్రభు త్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. సీసీఐ పునరుద్ధరణ విషయంలో జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసినట్లు తెలిపారు. సీసీఐని ప్రారంభించడం వల్ల వేలాది మందికి ఉపాధి లభించడంతోపాటు యువత వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. సీసీఐకి సంబంధించి కలెక్టర్ పూర్తి నివేదిక అందించాలని సూచించారు. నూతన టెక్నాలజీతో కాలుష్య రహిత పరిశ్రమను ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం ఆధీనంలో ఉన్న ఈ పరిశ్రమ ప్రారంభ విషయంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీల సహకారం తీసుకుంటామన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని మంత్రి తెలిపారు. జైనథ్ మండలంలోని పెన్‌గంగను పరిశీలించారు. పంటలకు నష్టం వాటిల్లకుండా ఇరువైపుల రక్షణ చర్యలు చేపడుతామన్నారు. నష్ట పరిహారానికి సంబంధించి అధికారులు పూర్తిస్థాయి నివేదిక అందించాలని సూచించారు. అనంతరం జాతీయ రహదారికి సమీపంలో నిర్మిస్తున్న ఐటీ టవర్‌ను మంత్రి పరిశీలించారు. నాణ్యమైన పనులు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 3 : భారీ వర్షాలు, వరదలతో సమస్యలను ఎదుర్కొంటున్న జీఎన్ఆర్ కాలనీ వాసులకు అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి మంత్రి పర్యటించారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులను కాలనీ వాసులు మంత్రికి వివరించారు.
చెక్‌డ్యాం నిర్మాణాన్ని కుదించి నాల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచి వరద నీటిని నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి మాట్లాడుతూ.. కాలనీ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీవాసుల సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి సాంకేతిక నిపుణులతో చర్చించి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసిన యంత్రాంగాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అమ్మద్, కిశోర్ కుమార్, భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, డీఎస్పీ గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ రాజు, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు పాల్గొన్నారు.