నస్పూర్/ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూన్ 10 : వర్షాకాలం నేపథ్యంలో విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలో విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంటువ్యాధులైన అతిసార, కలరా, మలేరియా, డెంగీ ఇతర వ్యాధుల వ్యాప్తి నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా లార్వా దశలోనే నిరోధించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మురుగు కాలువల్లో చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలని, వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయించాలన్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఫాగింగ్ చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహించాలని సూచించారు. పిడుగు పాటుకు గురైన వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించి కాపాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మురుగునీరు నిల్వ లేకుండా గుంతలను పూడ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్, దీపక్ తివారీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.