ఆదిలాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు 16న కురిసిన భారీ వర్షం అన్నదాతలను అపార నష్టానికి గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా వరదల కారణంగా రైతులు 18,310 ఎకరాల్లో పంటలు నష్టపోయారు. పత్తి 14,225 ఎకరాలు, సోయా 3,152 ఎకరాలు, కంది 473 ఎకరాలు, మొక్కజొన్న 364 ఎకరాలు, ఇంతర పంటలు 96 ఎకరాల్లో నష్టపోయినట్లు గుర్తించారు. వర్షాల కారణంగా 18,834 మంది రైతులకు నష్టం జరిగింది. ఆగస్టు 19న ఆదిలాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అధికారులు శాఖలవారీగా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలను సమగ్రంగా రూపొందించాలని సూచించారు. చేతికొచ్చే దశలో సోయా, కాత దశలో ఉన్న పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్‌లు ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఎకరాకు రూ.10 వేల సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నరు. మంత్రి పర్యటించి 20 రోజులు పూర్తయిన ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకున్నది. పెట్టుబడుల కోసం అప్పులు చేసిన తాము నష్టాన్ని ఎలా భరించాలో తెలియడం లేదని రైతులు అంటున్నారు. చేతికొచ్చే దశలో పత్తి, సోయా పంటలను భారీ వర్షాలు ముంచెత్తడంతో కోలుకోలేని దెబ్బతిన్నామని రైతులు అంటున్నారు.
వరదల సమయంలో జిల్లాలో పర్యటించిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి క్షేత్రస్థాయిలో నష్టం వివరాలు చూశారని, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు రైతు సంఘాల నాయకులు అంటున్నారు. రేపు(గురువారం) జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని రైతులు కోరుతున్నారు.