నిర్మల్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ) : అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కే.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో 14 ఏళ్లపాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రధానంగా సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యరంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం మంత్రి అల్లోల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి, ప్రజలకు సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగతి సాధించిందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుల బాధలతో సతమతమైన రైతులకు తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్.. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటుతోపాటు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ కొత్త రికార్డులు సాధిస్తోందన్నారు. నిన్న మొన్నటి వరకు ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు యేటా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. మంచి విద్యను అందిస్తే కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయన్నది సీఎం ఆలోచన అన్నారు. ఇలా ఏ రంగంలో చూసినా ప్రగతి స్పష్టంగా కనిపిస్తోందని, ఇదంతా కేవలం తెలంగాణ సాధించుకున్న ఈ పదేండ్లలో జరిగిన అభివృద్ధే అన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడి వనరులను మరింత సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశంలోనే నెంబర్ వన్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే సమీకృత కలెక్టరేట్ కార్యాలయంతోపాటు మెడికల్ కాలేజీని నిర్మించుకున్నామని, త్వరలోనే జిల్లా పోలీసు కార్యాలయ సముదాయం పూర్తవుతుందన్నారు. ఒక వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందిన ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు.
రాచరిక పాలన నుంచి విముక్తి
1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిందని మంత్రి అన్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం లభిస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిందన్నారు. పూర్వపు తెలంగాణ హైదరాబాద్‌తో కలుపుకొని మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కలిపి హైదరాబాద్ స్టేట్‌గా ఉండేదన్నారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు ద్వారా తెలుగు మాట్లాడే ప్రజలను ఆంధ్రప్రదేశ్‌తో విలీనం చేశారని గుర్తు చేశారు. అప్పటి నుండే చాలా మంది మేధావులు తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ ఆవేదన నుంచే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో నేడు అన్ని రంగాల్లో ప్రగతి పరుగులు పెడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కే.విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.