మంచిర్యాల, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో ఎప్పుడు మంత్రుల పర్యటన ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను బయటపెట్టేందుకే అన్నట్లుగా ఉంటుంది. రాష్ట్ర మంత్రుల పర్యటన ఉన్న రోజు స్థానిక నాయకుల మధ్య అంతర్గత గొడవలు ఏదో ఒక రకంగా బయటపడుతూనే ఉంటాయి. అంతకు ముందు చెన్నూర్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన అర్ధాతరంగా రద్దు అయిన విషయం విదితమే. మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ కారణంగానే అది రద్దు అయ్యిందనే ప్రచారం నడిచింది. కాగా, గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వచ్చారు.
ఈ పర్యటన జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి అగ్గిరాజేసింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రొటోకాల్ పాటించలేదని, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను అసలు ఈ ప్రోగామ్కే పిలవలేదని ఎంపీ వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. దవాఖాన శంకుస్థాపన ఆహ్వానంలో ఎంపీ పేరు పెట్టకుండా దళితులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల పేర్లు మాత్రమే పెట్టి దళితుడైన ఎంపీపై చిన్నచూపు చూశారంటూ సోషల్ మీడియాలో ఇన్విటేషన్ కార్డు ఫొటోలను పెట్టి వైరల్ చేశారు. గతంలో చెన్నూర్‌లో మంత్రుల పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఫొటోలను ఫ్లెక్సీల్లో వేయలేదని, దాన్ని మనసులో పెట్టుకొనే ఈ కార్యక్రమానికి ఉద్దేశ పూర్వకంగానే ఎంపీని పిలవలేదనే చర్చ నడిసింది. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మాత్రం ఎంపీ ఫొటోలు పెట్టి.. ఆయన్ని పిలవకుండా అవమానించారని.. పేరుకు మాత్రమే ఫ్లెక్సీల్లో ఫొటోలు వేసి చేతులు దులుపుకున్నారని గడ్డం వర్గం నాయకులు చెప్పుకుంటున్నారు.
జిల్లా కేంద్రంలో మంత్రుల పర్యటన ఉన్నా.. చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వినోద్ సహా ఎంపీ గడ్డం వంశీ కూడా హాజరు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే నుంచి ఆహ్వానం లేకపోవడంతోనే వారు రాలేదనే చర్చ నడిచింది. సరే ఎమ్మెల్యేలను పిలవపోతే పిలవలేదు. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీనైనా పిలవాలి కదా.. అని ఆ వర్గం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో వెన్నంటి ఉండి వంశీ కోసం ప్రచారం చేసిన ప్రేమ.. ఇప్పుడు ఎందుకు లేదంటూ మండిపడుతున్నారు. రాజకీయాలు ఏమైనా ఉంటే అవి అంతర్గతంగా ఉంచుకోవాలి కాని.. ఇలా అధికారిక కార్యక్రమాల్లో అవమానానికి గురి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పదవి కోసం స్థానిక ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. వీళ్ల కారణంగా వచ్చిన ప్రతిసారీ పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయంటూ ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చి, జిల్లాలో పార్టీ పటిష్టానికి అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దవాఖాన శంకుస్థాపన కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని చెప్పారు. వచ్చిన వారి కోసం భోజనాలు సైతం ఏర్పాటు చేశారు. కానీ మంత్రులు ఆలస్యంగా వచ్చారు. దీంతో కార్యక్రమం మొదలయ్యే సరికి మధ్యాహ్నం రెండు దాటింది. ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనర్సింహ ప్రసంగానికి ముందే సభకు వచ్చి వారిని భోజనాలకు అనుమతించారు. దీంతో మంత్రి మాట్లాడుతుండగానే వచ్చిన జనాలు వెళ్లి భోజనాలు చేశారు. ముఖ్య అతిథిగా మాట్లాడుతుండగానే భోజనాలు పెట్టడంతో ఖాళీ కుర్చీలకు ఆయన ప్రసంగం వినిపించాల్సి వచ్చింది.