నిర్మల్ చైన్‌గేట్, జూన్14 : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్మల్‌లోని దివ్య గార్డెన్లో వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఎంసీహెచ్ దవాఖానలో రూ.23.75 కోట్లతో చేపడుతున్న 50 పడకల క్రిటికల్ కేర్ దవాఖాన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రోగులకు పండ్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వైద్య రంగానికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పడ్డ నిర్మల్ జిల్లా వైద్యరంగంలో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ వైద్యశాలలను అభివృద్ధి చేశామన్నారు. ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న 50 పడకలకు 80 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. జిల్లా దవాఖానతో పాటు ఇతర దవాఖానలో 450 పడకలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు.
నిర్మల్ జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కాగా ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయన్నారు. డయాలసిస్ రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు వారికి ఉచిత బస్‌పాస్, సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రంలో నిర్వహిస్తున్నామన్నారు. బస్తీ, పల్లె దవాఖానలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వైద్య సిబ్బందిని నియామించామన్నారు. తల్లీబిడ్డ ఆరోగ్యానికి పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించారన్నారు.
రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లా మరింత అభివృద్ధి చేసుకుంటామన్నారు. విశిష్ట సేవలందించిన వైద్య సిబ్బందికి మంత్రి అవార్డులు అందజేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయగా సామాజిక కార్యకర్తలు రక్తదానం చేశారు. వారిని మంత్రి అభినందించారు. వైద్య సిబ్బంది నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో స్రవంతి, డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ జీవీడీఎస్ ప్రసాద్, నాయకులు, అధికారులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.