కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఏజెన్సీ ప్రాంతాల్లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న ‘సికిల్ సెల్’కు అడ్డుకట్టవేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రై వ్ నిర్వహిస్తున్నది. వంశపారపర్యంగా సంక్రమించే ఈ రక్త సంబంధిత వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్య సేవలు అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని అధికారులు చెబుతున్నారు.
కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్..
ప్రధానంగా గిరిజన తెగల్లో అంత్యంత వెనుకబడిన కొలాం, తోటి, మన్నేవార్ తెగలను తలసేమియా (ఎముక మూలుగలో రక్తకణాల ఉత్పత్తి నిలిచిపోయి రక్తహీనతకు దారితీయటం), సికిల్ సెల్ (వంశానుగత రక్తరుగ్మత) వ్యాధులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లోగల పాఠశాలల్లో 2015, 2022లలో సికిల్ సెల్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ప్రత్యేకంగా హాస్టళ్లు, వసతి గృహాల్లో రక్త నమూనాలను సేకరించి పరీక్షించారు. సుమారు 375 మందికి తలసేమియా, సికిల్‌సెల్ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ వ్యాధిపై జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అలాగే అవగాహన సదస్సులు కూడా చేపడుతున్నారు. మొత్తంగా 40 వేల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు.