నిర్మల్ టౌన్, మే 15 : వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం రైతులకు ఎరువు, విత్తనాలను మరింత చేరువ చేసేందుకు ఈ వానకాలం సీజన్ నుంచి రైతు వేదికల ద్వారా పంపిణీ చేసేందుకు యాక్షన్ ప్లాన్ రూపొంది స్తున్నది. ఇప్పటికే ప్రభుత్వం వానకాలం, రబీకి సంబంధించిన పెట్టుబడి సాయం ఎకరానికి రూ. 10వేలు అందిస్తున్నది. రైతు వేదికలు నిర్మించి ఏఈవోల సమక్షంలో రైతులకు సూచనలు, సలహాలు, వ్యవసాయ విజ్ఞానాన్ని అందిస్తున్నది. నిర్మల్ జిల్లాలో 79 వ్యవసాయ క్లస్టర్లుండగా ఒక్కొక్క క్లస్టర్లో 5 వేల ఎకరాలకు ఏఈవోను కేటాయించారు. పంటల సాగుకు అనుకూలంగా ప్రతి సంవత్సరం విత్తనాలను, ఎరువులను రైతుల కు అందుబాటులో ప్రభుత్వం ఉంచుతున్నది.
ఈ వానకాలం సీజన్ నుంచే జిల్లాలోని 79 వ్యవసా య క్లస్టర్ల పరిధిలో విత్తనాలు, ఎరువులను రైతు లకు అందించాలని ఇప్పటికే సూచన ప్రాయంగా తెలపడంతో అధికారులు అందుకు కార్యాచరణ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో రైతుల కు అవసరమయ్యే విత్తనాలను రాష్ట్ర విత్తనాభి వృద్ధిసంస్థ ద్వారా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి సరఫరా చేస్తుండగా ఎరువులను అగ్రోస్, డీసీఎంఎస్, పీఏసీఎస్ సొసైటీల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతున్న సంగతి తెలిసిందే. సీజన్లో ఎరువులు,విత్తనాలు తీసుకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచు కొని ప్రభుత్వం క్లస్టర్ల పరిధిలో వీటిని అందిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క క్లస్టర్ పరిధిలో 5 వేల సాగు విస్తీర్ణం ఉండడంతో ఏఈవోలు పంట సాగు మేరకు వీటిని సరఫరా చేయనున్నారు.
రైతులకు ఎంతో ప్రయోజనం..
జిల్లాలో 79 వ్యవసాయక్లస్టర్లు ఉన్నాయి. ఒక్కొక్క క్లస్టర్ల పరిధిలో ఐదు కిలోమీటర్ల పరిధి లో మూడు, నాలుగు గ్రామాలుండడంతో ఆ గ్రామాల రైతులు రైతు వేదికల్లోనే ఎరువులు, విత్తనాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయా లంటే మండల కేంద్రంలో ఉన్న పీఏసీఎస్, డీసీఎంఎస్, ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యేవి. విత్తనాలు, ఎరువుల కొరత సృష్టించి రైతులకు ఇబ్బంది ఏర్పడేది. ఇప్పుడు ఒక్కొక్క క్లస్టర్ల పరిధిలో సాగు విస్తీర్ణం ఏ ఎరువులు ఎంత మోతాదులో అవస రం, విత్తనాలు అవసరం ముందే గుర్తించి అధికా రులు రైతు వేదికల్లో అందుబాటులో ఉంచడంతో ఎలాంటి కొరత ఉండదు. రైతులకు ఇది లాభ సాటిగా మారనుంది. జిల్లాలో 32వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 6,500 కాంప్లెక్స్ ఎరువులు, వెయ్యి క్వింటాళ్ల వరకు వివిధ రకాల విత్తనాలు అవసరమని గుర్తించిన అధికారులు వాటిని మే 25లోగా రైతు వేదికలకు చేర్చి రైతులకు అందుబాటులో ఉంచే విధంగా యాక్షన్ప్లాన్ను రూపొందిస్తున్నారు.
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం..
నిర్మల్ జిల్లాలో వ్యవసాయ క్లస్టర్ల రైతు వేదికల ద్వారా విత్తనాలు, ఎరువులను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ మౌఖికంగా ఆదేశాలు అందించారు. ఏ క్లస్టర్ పరిధిలో ఎంత ఎరువులు, విత్తనాలు అవసరమో ఏఈవోలకు పంట సాగు విధానం ద్వారా స్పష్టత ఉంది. అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను అక్కడ ఉంచేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి