Mancherial | మంచిర్యాల అర్బన్, జూలై 14: మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో (ఎంసీహెచ్) లో ఎక్స్ రే సేవలు గత 15 రోజులుగా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్యవసరంగా ఎక్స్ రే అవసరమైన వారిని ఆసుపత్రిలోనే పరీక్షలు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 108 అంబులెన్స్ లో టీ-హబ్ (తెలంగాణ డయోగ్నస్టిక్ డిస్ట్రిక్ హబ్) కు తరలిస్తున్నారు. సాధారణంగా ఆసుపత్రిలోనే పూర్తవ్వాల్సిన పరీక్ష కోసం రోగులు, వారి కుటుంబ సభ్యులు గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.
ప్రమాదాలు, ఎముకల గాయాలు, కింద పడిపోవడం వంటి కేసుల్లో ఎక్స్ రే ఆత్యంత కీలకం. అయితే ఆసుపత్రిలో సౌకర్యం లేకపోవడంతో ముందుగా టీ-హబ్ కు వెళ్లి పరీక్షలు చేయించుకుని, ఆ తర్వాత మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విలువైన సమయం వృథా కావడంతో పాటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిపై రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నొప్పులతో బాధపడుతుండగా, మరోవైపు మరో ప్రాంతానికి తరలింపుతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.

Mancherial Govt Hospital2
రోజుకు పలువురు రోగులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ప్రాథమిక నిర్ధారణ సేవలు అందుబాటులో లేకపోవడం పట్ల ప్రజలు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎక్స్ రే సేవలను పునరుద్ధరించి, రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.