గాంధీనగర్: ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్ రూమ్‌లో ఒక జూనియర్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్, వేధింపుల ఆరోపణలపై నలుగురు సీనియర్ డాక్టర్లను సస్పెండ్ చేశారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Doctor Found Dead) గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల హర్ష్ పాండ్యా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నాడు. గత ఆరు నెలలుగా న్యూ సివిల్ హాస్పిటల్‌లోని మైక్రోబయాలజీ విభాగంలో రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం హాస్టల్ రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా దీనిపై స్పందించారు. వైద్య విద్య, పరిశోధనల అదనపు డైరెక్టర్ డాక్టర్ జయేష్ సచ్డే పర్యవేక్షణలో అంతర్గత విచారణ జరుపాలని, 24 గంటల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
మరోవైపు నలుగురు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఆ యువ వైద్యుడిని నిరంతరం వేధించినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో డాక్టర్ నిరాలి వసావే, డాక్టర్ అనుజ్ మహేశ్వరి, డాక్టర్ దీక్షిత్ ఘేవారియా, డాక్టర్ హీనా భుత్నేను ఆరు నెలల పాటు ఆసుపత్రి, హాస్టల్, అన్ని బోధనా కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేశారు.
అయితే సీనియర్ డాక్టర్ల వేధింపులు, ర్యాగింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. వైద్య విద్యార్థులు, డాక్టర్ల నుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. యువ వైద్యుడి ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.