కోటపల్లి, సెప్టెంబర్ 6 : కోటపల్లి మండలం ఎర్రాయిపేట గ్రామం సమీపంలో కల్వర్ట్ను బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించారు. మృతులను మహారాష్ట్రవాసులుగా గుర్తించారు పోలీసులు. సెప్టెంబర్ 4వ తేదీ గురువారం జాతీయ రహదారి నెంబర్ 63 పైన ఉన్న కల్వర్ట్ను వారి బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు విడిచారు. అయితే.. శనివారం రాత్రి పోలీసులు వాళ్ల మృతదేహాలను కనుగొన్నారు.
మహారాష్ట్రలోని సిరోంచా తాలూకా తుమ్మునూరు గ్రామానికి చెందిన సిద్దు రాములు బగురు సింగ్ (22), నాగేశ్ రాజన్న మెహత్రి, (25) ఈనెల 3న బైక్ మీద మంచిర్యాలకు వెళ్లారు. అదేరోజు సాయంత్రం చెన్నూర్ నుంచి సిరోంచా వైపు మీద వెళ్తుండగా వారి బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న వంతెనను ఢీకొన్నది. దాంతో.. ఇద్దరూ వంతెన కింద పడిపోయారు. తీవ్రంగా రక్తస్రావం, గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడే మృతి చెందినట్టు కోటపల్లి కోటపల్లి ఎస్సై రాజేందర్ వెల్లడించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.