కోటపల్లి, ఏప్రిల్ 2 : గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి బయలుదేరిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులను కోటపల్లి పోలీసుల అరెస్ట్ చేశారు. గిరిజన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు గిరిజనుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలనే డిమాండ్‌తో సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపట్టినట్టు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గుగులోతు బాపునాయక్ తెలిపారు.
ఇందులో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని ఖండించారు. రేవంత్ సర్కారులో ఆదివాసీ, బంజారాలకు మంత్రి పదవి ఇచ్చే దాకా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ఈ అక్రమ అరెస్టులకు భయపడమని, గిరిజన జాతి కోసం పోరాటాలు చేసి హక్కులను సాధించుకుంటామని పేర్కొన్నారు. బాపు నాయక్‌తో పాటు గిరిజన విద్యార్థి సంఘం నాయకులు రఘును పోలీసులు అరెస్ట్ చేశారు.