హాజీపూర్: హరిత తెలంగాణ లక్ష్యానికి (Haritha Haram) విద్యుత్ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. కరెంట్ తీగలకు అడ్డుగా వస్తున్నాయని పచ్చని చెట్లను విచణారహితంగా నరికివేస్తున్నారు. విద్యుత్ వైర్లను తాకుతున్న కొమ్మలను కాకుండా మొత్తం కొమ్మలను నరుకుతూ మోడుగా మారుస్తున్నారు. గ్రామాలు పచ్చదనంతో ఫరిడవిల్లాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రహదారులకు ఇరు వైపులా పెద్దఎత్తున మొక్కలను నాటింది. ప్రస్తుతం ఆవి ఏపుగా పెరిగి పచ్చదనంతోపాటు నీడను పంచుతున్నాయి.
అయితే హాజీపూర్ మండల కేంద్రం నుంచి టీకనపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో కరెంటు తీగలకు అడ్డుగా వస్తున్నాయని విద్యుత్ శాఖ అధికారు ఇటీవల చెట్లను నరికి వేశారు. అయితే చెట్లను నరకాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు అడవి నుంచి పాల పొరుకను తీసుకొచ్చి పచ్చని పందిరి వేస్తారు. ఆలా తెచ్చుకొనే గ్రామాల రైతులకు జరిమానా విదిస్తున్న అటవీ శాఖ అధికారులకు చెట్ల నరికి వేత కనిపించటం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.