దండేపల్లి : తాను పాఠశాలలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ పాఠశాల మాజీ ఎస్ఎంసీ చైర్మన్ గడికొప్పుల విజయ భర్త తిరుపతి పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుత్తేదారు, మాజీ ఎస్ఎంసి చైర్మన్ గడికొప్పుల విజయ వెల్గనూరు ఉన్నత పాఠశాల మన ఊరు- మన బడి పథకంలో పాటు ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా నూతన డైనింగ్ హాల్, టాయిలెట్స్, వాటర్ సంపు, విద్యుత్ మరమ్మతు, ప్రహరీ పనులు చేపట్టారు.
దీనికోసం సుమారు రూ. 28 లక్షల ఖర్చు చేశానని కేవలం రూ.5 లక్షల బిల్లు మాత్రమే వచ్చిందని, ఇంకా 23 లక్షల బిల్లులు రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని, చేసేదేమీ లేక పాఠశాల గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. ఈ సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గేటు బయట నిరీక్షించాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ తహసీనుద్దీన్ అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
అనంతరం పాఠశాల యధావిధిగా కొనసాగింది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్- కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తుందని, బిల్లులు పెండింగ్లో ఉంచుతుందని మండిపడ్డారు. అనంతరం ఎస్ఎంసీ చైర్మన్ విజయ మాట్లాడుతూ రూ.28 లక్షల పనులు అప్పులు తీసుకొచ్చి చేశానని, వడ్డీలు కట్టలేక పోతున్నానని వాపోయింది. అప్పు పత్రాలు చూయిస్తూ కన్నీటి పర్యంతమైంది. జిల్లా కలెక్టర్ తో సహా సంబంధిత అధికారులకు కలిసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే చావే శరణ్యమని వాపోయింది.