కాసిపేట, అక్టోబర్ 4: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొండాపూర్ సబ్ స్టేషన్ ఎదుట వైన్స్ షాప్ వద్ద జరిగిన దాడిలో అచ్యుత్ర్రావు గూడెంకు చెందిన ఆదివాసీలు రాంచందర్, జంగుపై పలువురు దాడి చేసిన ఘటనపై అచ్యుత్‌రావు గూడెం ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీని కింద పడేసి కాళ్లతో తన్నడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా భారీగా ఆదివాసీలు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దాడి చేసిన వారిని తమకు అప్పగించాలంటూ నిందితులపై దాడికి యత్నించారు.
దీంతో పోలీసులు అప్రమత్తమై వారికి రక్షించి తరలించారు. కాసేపు తోపులాట జరిగింది. దాడి చేసిన వారు ఏడుగురు ఉండడంతో వారిని అరెస్ట్ చేయడానికి వెళ్లి తీసుకువచ్చే క్రమంలో ఆదివాసీలు వారిపై దాడికి ప్రయత్నించారు. భారీ పోలీస్ బందోబస్త్ ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దాడికి యత్నించే ప్రయత్నంతో నిందితులకు ఏమీ కాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీసులకు నచ్చజెప్పి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేవాపూర్‌లో భారీగా పోలీసులను మోహరించారు.