Tiger | తాండూర్, ఆగస్టు 23: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్ షిప్ పరిసరాల్లో అడవిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆటవీశాఖ అధికారులు గుర్తించారు. కొన్ని రోజులుగా బెల్లంపల్లి రేంజ్ పరిధిలోని బుగ్గగూడెం, మాదారం, కుమ్రంభీం జిల్లాలోని తిర్యాణి బీట్లలో తిరుగుతున్న పెద్దపులి ప్రస్తుతం ఈ వైపుగా రావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలపై నిఘా పెంచారు.
ప్రస్తుతం పులి గుట్ట మీద ఉందని, అది అటు వైపు దిగితే తిర్యాణి వైపు వెళ్తుందని, లేకపోతే మాదారం వైపు వచ్చే అవకాశం ఉందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. మాదారం టౌన్ షిప్ ప్రాంతంలోని ప్రజలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దానికి ఎవరూ హాని తలపెట్టకుండా అటవీ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఇటీవలే ఆ పులి తిర్యాణి, కాసిపేట మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో 4 మూగజీవాలను చంపినట్లు తెలుస్తోంది. ఆటవీ ప్రాంత సమీప ప్రజలు, పశువుల కాపర్లు పులి సంచారం విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని ఆటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.