మంచిర్యాల అర్బన్, ఆగస్టు 26 : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు నడకను కోల్పోవడంతో హైదరాబాద్ హైటెక్ సిటీ లోని యశోద హాస్పిటల్లో అరుదైన సయాటిక్ నరాల శస్త్ర చికిత్సను నిర్వహించి రోగిని నడిపించడంలో విజయవంతమైనట్లు హాస్పిటల్ వైద్యుడు కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రీ కన్స్ట్రక్షన్ సర్జన్ డాక్టర్ పి.ప్రకాష్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నార్తిన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా చింతనమనేపల్లి కి చెందిన ఎలుములకు పవన్ కుమార్(24) అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా పని చేస్తున్నాడు.ఓ రోడ్డు ప్రమాదంలో తుంటి, తొడ భాగం విరిగి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ నిర్వహించారు. శస్త్ర చికిత్స తరువాత తీవ్రమైన సయాటిక్ నరాల గాయం, కాలు కింద పెట్టకుండా, తీవ్రమైన న్యూరోపతి నొప్పితో తొమ్మిది నెలలుగా ఇబ్బంది పడ్డాడు. చివరికి యశోద హాస్పిటల్లో చేర్పించారు. యశోదలో శస్త్ర చికిత్స చేసి పవన్‌ను రెండు నెలల్లో యధావిధిగా నడిపించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ పాలకుర్తి నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.