కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న లోడింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి కంపెనీ గేటు ఎదుట విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఒక్కసారిగా మెరుపు సమ్మె చేశారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీని అదానీ తీసుకున్నప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టు విధానాన్ని తీసివేసి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వర్క్ క్యాలెండర్ మార్పు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
గ్రాడ్యుయేట్ అలవెన్స్‌ల విషయంలో ఇబ్బందులు పెడుతున్నారన్నారని కార్మికులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం దిగివచ్చేంత వరకు, సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికుల మాదిరిగానే లోడింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తూ అన్ని రకాల బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ కార్మికుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.