తాండూర్, ఫిబ్రవరి 12 : క్రీడలు మానసికొల్లాసానికి, శరీర దారుడ్యానికి, స్నేహ సౌబ్రాతృత్వం పెంపొందించుకోవడం కోసం ఎంతో ఉపయోగపడతాయని చౌటపల్లి సర్పంచ్ ముదాం సునీత, తాండూర్ మాజీ ఎంపీపీ మాసాడి శ్రీదేవి అన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం చౌటపల్లి గ్రామంలో కీర్తిశేషులు మాసాడి విష్ణువర్ధన్ స్మారక క్రికెట్ పోటీలను వారి కుటుంబ సభ్యులు, నిర్వాహకులు గురువారం నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీలను ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని, క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని, క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయని సోదర భావంతో క్రీడలలో పాల్గొనాలని ఎలాంటి గొడవలకు తావివ్వకుండా జరుపుకోవాలని కోరారు.
చౌటపల్లి, అంకుశం, బోయపల్లి, ద్వారకాపూర్, కాసిపేట ఐదు గ్రామపంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో మొత్తం 6 ప్రాంచైజెస్ టీంలు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రీడ పోటీలు 7 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలలో విన్నర్ జట్టుకు పదివేల రూపాయల నగదు తో పాటు షీల్డు, రన్నర్ జట్టుకు 8 వేల రూపాయల నగదుతో పాటు షీల్డు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు మాసాడి శశివర్ధన్, ఆర్గనైజర్ చాందా సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాసాడి శ్రీరాములు, మాసాడి తిరుపతి, ముదాం రఘు, సుందిళ్ల భూమయ్య, డిటి రావు, చీమల రాయలింగు, బైరి శ్రీను, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.