బెల్లంపల్లి : ఏ ప్రభుత్వ కార్యాలయ సిబ్బందైనా వచ్చి తమ పని తాము చేసుకొని వెళ్లిపోతారే తప్ప కార్యాలయ పరిసరాల గురించి మాత్రం పట్టించుకోరు. లేదంటే పంచాయతీ కార్మికులకు చెప్పి పనులు చేయిస్తారు. కానీ మంచిర్యాల జిల్లా కాసిపేట మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది మాత్రం అందరికీ ఆదర్శంగా నిలిచారు.
మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో ఎవరి కోసం వేచి చూడకుండా వారే స్వయంగా మొత్తం కార్యాలయ ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రంచేశారు. ఈ మేరకు అధికారులను, సిబ్బందిని ఎంపీవో శేఖ్ సఫ్టర్ అలీ అభినందించారు. శుభ్రంచేసిన వారిలో మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీ నారాయణ, జూనియర్ అసిస్టెంట్ తిరుపతి, అటెండర్లు రాజేశ్వరి, గణపతి ఉన్నారు.